Trainee Doctor : తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని ఓ వైద్య కళాశాల భవనంపై నుంచి దూకి ఓ శిక్షణ వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. కాంచీపురం జిల్లాలో మీనాక్షి వైద్య కళాశాలలో షెర్లిన్(23) అనే యువతి వైద్య విద్యను అభ్యసిస్తోంది. అక్కడ శిక్షణ వైద్యురాలిగా కొనసాగుతోంది. ఆమె మీనాక్షి కాలేజీ క్యాంపస్ లోని ఓ భవనంలో ఉంటోంది. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత కాలేజీ భవనం అయిదవ అంతస్తులోకి ఎక్కింది. అక్కడ కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఐదవ అంతస్తు ఎక్కిన తర్వాత కిటికీ పై కూర్చున్న దృశ్యాలను కొంతమంది విద్యార్థినులు తమ ఫోన్లలో వీడియో తీశారు. ఆమెను ఆపడానికి ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే ఆమె కిటికీ నుంచి దూకింది. కిటికీ నుంచి దూకిన తర్వాత ఆమె తీవ్రంగా గాయపడింది. వెంటనే అదే ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. ఈ ఘటనను కాంచీపురం పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. అనంతరం అక్కడి విద్యార్థులను విచారించారు. షెర్లిన్ స్నేహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు చెప్పిన వివరాలు పోలీసులను షాక్ కు గురిచేశాయి..
ప్రేమలో ఉందట..
” షెర్లిన్ ఉత్తమ విద్యార్థిని. అందరితోనూ బాగుంటుంది. ఆమెకు మొన్నటిదాకా ఎటువంటి సమస్యలు లేవు. పైగా ఆమె తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా స్థితి మంతులు. అయితే కొద్ది రోజులుగా ఆమె డిప్రెషన్ తో బాధపడుతోంది. ఆమె స్నేహితుడు మోసం చేయడం వల్లే అలాంటి స్థితిని ఎదుర్కొంటున్నని మాకు అర్థమైంది. అయితే దాని గురించి మాకు ఎలాంటి విషయం కూడా చెప్పలేదు. ఆమె ఎవరితో ప్రేమలో ఉంది? ఎవరి వల్ల మోసపోయింది? అతడికి, ఆమెకు ఏమైనా గొడవలు చోటు చేసుకున్నాయా? అలాంటి విషయాలు మాకు తెలియదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఆమెకు ఎదురైందంటే కచ్చితంగా ఏదో జరిగే ఉంటుంది. మేము ఎంత ఆపాలని ప్రయత్నించినప్పటికీ ఆమె ఆత్మహత్య చేసుకోడాన్ని మానుకోలేదు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కిటికీ ద్వారా ఐదు అంతస్తుల భవనం నుంచి దూకింది. ఆమె దూకినప్పుడు తలకు బలమైన గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావం జరగడంతో అపస్మారక స్థితికి వెళ్ళింది.. చికిత్స అందించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయిందని” ఆమె స్నేహితులు పోలీసులతో పేర్కొన్నారు.. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని కాంచీపురం పోలీసులు చెబుతున్నారు.