Honey trap case: అందమే పెట్టుబడి. మాట తీరే రాబడి.. నవ్వుతూ ఫోటోలు పెడుతుంటారు. రెచ్చగొట్టే విధంగా రీల్స్ చేస్తుంటారు. ఆ తర్వాత తమ ఫాలోవర్స్ నేపథ్యాన్ని పరిశీలిస్తారు. అందులో బిగ్ షాట్ లను ఎంచుకుంటారు. ఆ తర్వాత సందేశాలు పంపుతుంటారు. కలుపుగోలుగా మాట్లాడుతుంటారు. నెంబర్లు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇక ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది.
సోషల్ మీడియా వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఆ రీల్స్ ద్వారా కొంతమంది సెలబ్రిటీలు అవుతుంటే.. మరి కొంతమంది మహిళలు అడ్డగోలు సంపాదనకు అవకాశాలు సృష్టించుకుంటున్నారు. తమ అందమైన దేహాన్ని పెట్టుబడిగా వాడుకుని.. దానిని రాబడిగా మార్చుకుంటున్నారు.
ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ నగరంలో ఓ వివాహిత చేసిన అరాచకం సంచలనం సృష్టించింది. ఆమె అందమైన రీల్స్ చేస్తూ చాలామందిని తన బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత వారితో పాడు పనిచేసింది. అలా చేస్తుండగా ఆమె భర్త రహస్యంగా వీడియోలు తీస్తుండేవాడు. ఆ తర్వాత ఆ వీడియోలను చూపించి ఆమె బెదిరించడం మొదలు పెట్టేది. ఇలా వందమందిని తన బుట్టలో వేసుకొని మోసం చేసింది. వారి దగ్గర నుంచి లక్షలకు లక్షలు డబ్బులు లాగింది. ఓ వ్యాపారిని ఇలానే ట్రాప్ చేసి.. లక్షలకు లక్షలు లాగింది. డబ్బులు ఇంకా డిమాండ్ చేయడంతో ఆ వ్యాపారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఆ వివాహిత, ఆమె భర్త సాధించిన వ్యవహారం ముగిసిపోయింది.
ఆ వివాహిత చేసిన అరాచకమే పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తే.. ఇప్పుడు తెరపైకి మరో లేడీ వ్యవహారం వచ్చింది. ఆ లేడీ కి వివాహమైంది. మొదట్లో ఆమె సంసారం సజావుగానే సాగింది. ఆ తర్వాతే ఆమె పెడదారి పట్టింది. అందంగా ఉండడంతో దానిని ఆమె తనకు పెట్టుబడిగా మార్చుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ చాలామందిని ఆకట్టుకున్నది. ఆ తర్వాత తన దందాకు తెరలేపింది. పెద్ద పెద్ద వ్యక్తులను మోహించి వారితో సన్నిహితంగా ఉండేది. ఆ సమయంలో కొంతమంది వీడియో తీసేవారు. ఆ తర్వాత వీడియోలను బయటపెడతామని బెదిరించేవారు. ఇలా చాలామందిని బెదిరించి భారీగా డబ్బులు వసూలు చేశారు.
గత ఏడాది డిసెంబర్ నెలలో జగిత్యాల జిల్లా మెట్ పల్లి పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆ లేడీ ముఠాలోని కొంతమంది బెదిరించారు. అతడి వీడియోలు బయటపెడతామని 7 లక్షల దాకా వసూలు చేశారు. దీంతో అతడు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. అంతేకాదు ఆ లేడీ, కోవిడ్ సమయంలో విడుదల చేసిన వీడియోలు కరీంనగర్ జిల్లాలో సంచలనం కలిగించాయి. మెట్ పల్లి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు తెలుస్తున్నాయి. ఆ లేడీ ఆరేపల్లి కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తోంది.
కేవలం ఆమె మాత్రమే కాకుండా, కొంతమంది యువతులను ఈ రొంపిలోకి లాగినట్టు తెలుస్తోంది. వారితో రీల్స్, వీడియోలు షూట్ చేయించి.. సోషల్ మీడియాలో ప్రత్యేకంగా పేజీలు ఓపెన్ చేయించి.. పెద్ద పెద్ద వ్యక్తులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె లిస్టులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారని.. వారంతా కూడా ఆమెకు భారీగానే సమర్పించుకున్నారని పోలీసులు చెబుతున్నారు.