Train signal : ఆ ప్రాంతంలో పెద్దగా వర్షం లేదు. అలాగని మంచు కూడా కురవడం లేదు. అకస్మాత్తుగా సిగ్నల్స్ నిలిచిపోయాయి. దీంతో రెండు రైళ్లు ఆగిపోయాయి. కారణం ఏంటో తెలియక లోకో పైలట్లు (డ్రైవర్లు) దిగారు. ఫోన్లో ఉన్నతాధికారులను సంప్రదించారు. సిగ్నల్ నిలిచిపోయిందని చెబితే.. ఆ ఉన్నతాధికారులు కూడా ఆందోళనకు గురయ్యారు. సిగ్నల్స్ చెక్ చేస్తే అక్కడ అంతా బాగానే ఉందని మానిటర్లో కనిపిస్తోంది. ఏం జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులను రంగంలోకి దింపితే.. అసలు విషయం వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
హిమాలయ పర్వతాలకి దగ్గరగా ఉండే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లక్సర్ అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ట్రైన్ సిగ్నల్స్ నుంచి పోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. స్తంభాలను మరీ ఎత్తుతో కాకుండా, మామూలు పరిధిలో నిర్మించారు. అయితే ఈ సిగ్నల్స్ స్తంభాలకు కొంతమంది దుండగులు బురద పూశారు. దీనివల్ల సిగ్నల్స్ నిలిచిపోయాయి. ఫలితంగా రైళ్లు ఆగిపోయాయి. దీంతో ఆ దుండగులు రైళ్లల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ఉన్న నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను దోచుకునేందుకు ప్రయత్నించారు. అయితే ప్రయాణికులు ఆ దుండగులకు ఎదురు తిరిగారు. దీంతో వారు ప్రయాణికులపై రాళ్లు రువ్వారు. ప్రయాణికులు పోలీసులకు ఫోన్లు చేసేందుకు ప్రయత్నిస్తుండడంతో.. ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
మొరాదాబాద్ – సహరన్ పూర్ రైల్వే డివిజన్ పరిధిలోకి లక్సర్ రైల్వే స్టేషన్ వస్తుంది. ఇది పూర్తిగా పర్వత ప్రాంతం కావడంతో దుండగులు ఎవరూ రారు అనుకొని, సిగ్నల్స్ స్తంభాలకు బురద పూశారు. దీనివల్ల రైళ్లకు సిగ్నల్స్ నిలిచిపోయాయి. సిగ్నల్స్ లేకపోవడంతో పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్, గోరఖ్ పూర్ – చండీగఢ్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో ప్రయాణికుల వద్ద ఉన్న విలువైన వస్తువులను దొంగిలించేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. ప్రయాణికులు ఎదురు తిరగడంతో అక్కడి నుంచి వారు పరారయ్యారు. ఈ విషయాన్ని లోకో పైలట్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించడంతో జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకుని విచారణకు ఆదేశించారు. సిగ్నల్స్ పై పూసిన బురదను తొలగించారు. ఆ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పరిశీలించి.. దుండగుల ఆచూకీపై ఆరా తీస్తున్నారు..
దుండగులు సిగ్నల్ పై బురద పూయడంతో లక్సర్ రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే పాటలీపుత్ర ఎక్స్ ప్రెస్ షెడ్యూల్ కంటే ఆలస్యంగా నడుస్తోంది.. ఈ రైలు గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత రూర్కి రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరింది. శుక్రవారం మధ్యాహ్నానికి లక్సర్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అప్పటికే దుండగులు సిగ్నల్ పై బురద పూయడంతో లోకో పైలట్ రైలును ఆపాడు.. అయితే ఈ వ్యవహారంపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. దుండగులను త్వరలో పట్టుకుంటామని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు.