Secunderabad: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అంటారు.. కాకపోతే కొంతమంది ఉపాయాలను అక్రమాలకు.. అన్యాయాలకు అనుకూలంగా మార్చుకుంటారు. చివరికి దండిగా సంపాదించి సమాజంలో గొప్ప వ్యక్తులుగా వెలుగు వెలిగిపోతుంటారు. అలాంటి ఓ వ్యక్తి తాను ఎదగడానికి అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. చివరికి దొరికిపోయాడు..
ఆ వ్యక్తి కి డబ్బు అంటే చాలా ఇష్టం. కాకపోతే దానిని కష్టపడి సంపాదించాలి అనుకోకుండా.. అడ్డమైన మార్గాల్లో సంపాదించాలని అనుకున్నాడు.. దానికి తగ్గట్టుగానే తాను ఎవరో తెలియకుండానే నేరం చేసేందుకు ప్రణాళిక రూపొందించాడు. ఎటువంటి నేరచరిత్ర లేని కొంతమందిని ఎంపిక చేసుకొని ముఠాగా ఏర్పడ్డాడు. దోపిడికి ప్రణాళిక రూపొందించాడు. అలా దోపిడీ చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అనుకూలంగా మార్చుకున్నాడు. ఈ స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ .. చివరికి అతని ముఠా పోలీసులకు దొరికిపోయింది.
సికింద్రాబాద్లోని కార్ఖానా ప్రాంతంలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గిరి నివాసంలో 13 మంది నేపాలి దొంగలు దోపిడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ నెల 16న ఈ దోపిడీ జరిగింది. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ పోలీసులు తీసుకున్నారు.. దొంగలను పట్టుకోడానికి ఏకంగా 20 రాష్ట్రాలు తిరిగారు. చివరికి దొంగలను పట్టుకుని పోలీస్ పవర్ ఏమిటో చూపించారు.
కార్ఖానా ప్రాంతంలోని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తన ఇంట్లో పని చేయడానికి కొంతమంది మనుషులు కావాలని ఒక ఏజెన్సీని సంప్రదించారు. ఆ సమయంలో ఆ రిటైర్డ్ ఆఫీసర్ ను ఓ మహిళ, మరో వ్యక్తి సంప్రదించారు. తమ పేర్లు రాజ బహుదూర్, రేఖ దేవి అని.. తాను నేపాల్ దేశానికి చెందిన వారమని పరిచయం చేసుకున్నారు. వారి ఇంట్లో పనికి కుదిరారు.. పనిలో చేరిన మొదటి రోజు నుంచే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంట్లో బంగారాన్ని భద్రపరిచే ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలించారు.. దీనికి సంబంధించిన వివరాలను నేపాల్ దేశానికి చెందిన బీరేందర్ షాహి కి చెబుతుండేవారు. ఈ క్రమంలో బీరేందర్ నగరంలోని అనేక ప్రాంతాలలో పనిచేస్తున్న 11 మందితో ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. గత నెలలో వారందరితో సమావేశం నిర్వహించాడు..
ఇక అదే నెల 15వ తేదీన తన తల్లిని ఇంట్లో ఉంచి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ దంపతులు పంజాగుట్ట పనిమీద వెళ్లారు. ఇక అదే రోజు రాత్రి ముఠాలోని ఆరుగురు వ్యక్తులు ఆటోలో రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఇంటికి వచ్చారు. అయితే ఆకస్మాత్తుగా రిటైర్డ్ ఆఫీసర్ తన భార్యతో ఇంటికి వచ్చాడు. తమ ప్లాన్ కు అడ్డుగా ఉన్నాడని భావించిన ఆ దొంగలు అతడిని బంధించారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదు తీసుకొని వెళ్లారు.. దొంగతనం విజయవంతమైన తర్వాత ఆ 13 మంది తమ ఫోన్లను పూర్తిగా స్విచాఫ్ చేశారు. దొంగిలించిన సొమ్మును మొత్తం పంచుకున్నారు.
ఆ 13 మంది నాలుగు బృందాలుగా విడిపోయారు. కొందరు కర్ణాటక.. మరికొందరు గుంటూరు.. ఇంకొందరు కోల్ కతా.. మిగతావారు సూరత్ వైపు వెళ్ళిపోయారు.. వారు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాల గురించి సోషల్ మీడియాలో మాత్రమే చర్చించుకునేవారు. ప్రతిరోజు తాము ఉండే ప్రాంతానికి కొంత దూరం వెళ్లి మిగతా వారితో మాట్లాడి వచ్చేవారు. పోలీసులు తమ లొకేషన్ గుర్తించకుండా ఉండడానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ రూటర్లు ఉపయోగించేవారు.
ఒకే మార్గం ద్వారా ప్రయాణిస్తే పోలీసులకు దొరికే అవకాశం ఉన్న నేపథ్యంలో వివిధ ప్రాంతాల లో తిరుగుతూ బీహార్ , నేపాల్ సరిహద్దుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే హైదరాబాద్ పోలీసులు దాదాపు 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించారు. చివరికి నిందితుల అసలు కథను పసిగట్టారు. వారు వెళ్ళిన ప్రాంతాలకు ప్రత్యేకంగా పోలీసు బృందాలను పంపించారు. సోషల్ మీడియా ద్వారా ఆ ముఠా సభ్యులు సంభాషణలు జరుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు..
రాజ్ బహుదూర్ షాహి, మహేందర్, గోర్కే, అమిత్, సుభాష్ అనే వ్యక్తులను అరెస్ట్ చేశారు.. అయితే బీరేందర్ చెప్పినట్టుగానే తాము చేసామని దొంగలు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. బీరేందర్ ప్రస్తుతం బెంగళూరులో ఉంటున్నట్టు తెలుస్తోంది. అతని కోసం పోలీసులు బెంగళూరు వెళ్లారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకుంటే ఈ ముఠా దోపిడీలు, అక్రమాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు