One Chip Challenge: గత ఏడాది సెప్టెంబర్ నెలలో.. అమెరికాకు చెందిన వోలోబా అనే 14 సంవత్సరాల బాలుడు చిప్స్ తిని గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతడి మరణం అప్పట్లో పెద్ద సంచలనమైంది. అయితే అతడు వన్ చిప్ చాలెంజ్ లో పాల్గొని చనిపోయాడని వార్తలు వచ్చాయి. దీనిపై విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వోలోబా తీసుకున్న చిప్స్ లో అధిక మోతాదులో క్యాప్సైసిన్ అనే ఘాటు పదార్థం ఉందట. అందువల్లే అతడు మరణించాడట. అధిక క్యాప్సైసిన్ సాంద్రత ఉన్న ఆహార పదార్థం తీసుకోవడం వల్ల వోలోబా కార్డియో ఫల్మోనరి అరెస్టుకు గురయ్యాడు. దీంతో అతడు మరణించాడని వైద్యులు నివేదిక ఇచ్చారు. మరోవైపు వోలోబా కు చిన్నతనం నుంచే హృదయ సంబంధిత సమస్య ఉంది.. అయితే ఈ విషయం అతడి కుటుంబ సభ్యులకు తెలియదు.. వోలోబా ను శవపరీక్ష చేస్తున్న సమయంలో వైద్యులు ఈ విషయాన్ని గుర్తించారు. అతడి గుండె ఉబ్బి పోయిందని ప్రకటించారు.
గత ఏడాది పాఖీ అనే కంపెనీ తాను తయారు చేస్తున్న చిప్స్ ను ప్రమోట్ చేసేందుకు “one chip challenge” ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందులో పాల్గొనే వారు కచ్చితంగా తాము తయారు చేసిన ఒక కరోలినా రీపర్ చిప్ తినాలి. ఆ తర్వాత ఎటువంటి ఆహారం లేదా నీరు తీసుకోవద్దు. ఈ ఛాలెంజ్ లో చాలామంది సినీ నటులు పాల్గొన్నారు. అయితే ఆ చిప్ తిన్నవారు వాంతులు, విరోచనాలు చేసుకున్నారు. కొందరు కళ్ళు తిరిగి కింద పడ్డారు. అప్పట్లో దీనిపై భారీగా విమర్శలు వచ్చాయి. వోలోబా చిప్ తిన్న తర్వాత గుండెపోటుతో చనిపోయాడు. దీంతో పాఖీ కంపెనీ ఈ ఛాలెంజ్ ను వెనక్కి తీసుకుంది. అంతేకాదు మార్కెట్ నుంచి చిప్స్ ను ఉపసంహరించుకుంది. పాఖీ కంపెనీ తయారు చేసే చిప్స్ ఘాటుగా ఉంటాయి. ఇందులో మిరప రసం తో పాటు.. ఇతర మసాలాలు కలుపుతుంది. అందువల్లే అవి ఘాటుగా ఉంటాయి. పైగా ఆ చిప్స్ ను శవపేటిక ఆకారంలో ఉండే ప్యాకెట్ లో అమ్ముతుంది. అయితే వీటిని కేవలం వయోజనులు మాత్రమే తీసుకోవాలని పాఖీ కంపెనీ స్పష్టంగా పేర్కొంది.
వోలోబా మరణం పట్ల పాఖీ కంపెనీపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ స్పందించింది. ” వోలోబా మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. చిప్స్ కేవలం వయోజనులకు మాత్రమే. దీనిని మేము స్పష్టంగా పేర్కొన్నాం. అనారోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తీసుకోకూడదు.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చిప్స్ తినొద్దు.. మా సూచనలు పట్టించుకోకుండా వోలోబా తిన్నాడు. ఈ చిప్స్ ను గత ఏడాది మార్కెట్ నుంచి వెనక్కి తీసుకున్నామని” పాఖీ ప్రకటించింది.