Surgery via Video Call: భలే భలే మగాడివోయ్ సినిమా చూశారా.. అందులో హీరోయిన్ వదినకి పురిటి నొప్పులు వస్తాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ ఉండరు. అదే సందర్భంలో హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు. జరిగిన పరిస్థితిని హీరోయిన్ కు చెప్తాడు. ఆమె వీడియో కాల్ లో ఏం చేయాలో చెబుతుంది.. ఆ వీడియోలో చెప్పినట్టుగానే హీరో చేస్తుంటాడు. చివరికి పురిటి నొప్పులతో బాధపడుతున్న హీరోయిన్ వదినను ఆసుపత్రికి తీసుకెళ్తాడు.
అదంటే సినిమా కాబట్టి.. సినిమాలో లాజిక్ వెతకాల్సిన అవసరం లేదు కాబట్టి అలా చేశారు. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా? అలా చేస్తే మనిషి బతుకుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానం ఏమో గాని.. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో జరిగిన ఓ సంఘటన మాత్రం మహిళ ప్రాణాలకు ముప్పు తెచ్చింది. చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమైంది జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం భోజనం పేట గ్రామానికి చెందిన ఐత రాజవ్వ (45) అనే మహిళ ఇటీవల అనారోగ్యానికి గురైంది. విపరీతంగా కడుపునొప్పి వస్తుండడంతో తట్టుకోలేక వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భసంచిలో రాళ్లు ఉన్నాయని గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు.. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను పల్లవి అనే ఆసుపత్రిలో చేర్పించారు.. ఆపరేషన్ చేస్తుండగా రాజవ్వకు గుండెపోటు వచ్చిందని.. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఆమె దక్కలేదని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు.. దీంతో రాజవ్వ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
అందువల్లే చనిపోయిందట..
ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లే క్రమంలో రాజవ్వ బాగానే ఉంది. ఆ సమయంలో ఆమెకు అంది పరీక్షలు కూడా చేశారు. ఆమెకు మత్తు ఇంజక్షన్ ఇచ్చేవరకు కుటుంబ సభ్యులు అక్కడే ఉన్నారు.. ఆ తర్వాత ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి వచ్చారు. ఆపరేషన్ మొదలుపెట్టిన వైద్యులు సక్రమంగా చేసి ఉంటే బాగుండేది. కానీ హైదరాబాద్ లోని వైద్యులతో ఫోన్ లో వీడియో కాల్ చేస్తూ ఆపరేషన్ చేశారు. దీంతో రాజవ్వ అపస్మారక స్థితికి చేరుకొని చనిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు..” గర్భసంచిలో లో రాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. ఆమె నొప్పితో బాధపడుతున్న తీరు చూడలేక ఆసుపత్రిలో చేర్పించాం. శస్త్ర చికిత్స కూడా చేయాలని చెబితే దానికి ఒప్పుకున్నాం. డబ్బులు కూడా చెల్లించాం. ఆపరేషన్ థియేటర్ కు వెళ్తున్నప్పుడు రాజవ్వ బాగానే ఉంది. మాతో మంచిగానే మాట్లాడింది. ధైర్యంగా ఉండాలని మాకు చెప్పింది. మేము ఏడుస్తుంటే కన్నీళ్లు తుడిచింది. చివరికి విగత జీవిగా వచ్చేసింది. ఇంత దారుణం మరొకటి ఉండదు. ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి వస్తే.. చంపేసి పంపించారని” కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.. ఆస్పత్రి యాజమాన్యంపై, వైద్యులపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.. కాగా ఈ సంఘటన జగిత్యాల పట్టణంలో సంచలనం సృష్టించింది. ఇదే ఆసుపత్రిలో గతంలో ఈ తరహా సంఘటనలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.. వైద్యులు నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేయడంతో చాలామంది రోగులు ప్రాణాలు కోల్పోయారని.. ఇప్పుడు రాజవ్వ కూడా అలానే చనిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.