Hyderabad : హైదరాబాద్ నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో కృష్ణా నగర్ లో ఈ నెల నాలుగున ఓ ఇంట్లో చోరీ జరిగింది. 60 తులాల బంగారం తస్కరణకు గురైంది. అదే ప్రాంతంలో తాళం వేసి ఉన్న మరో ఇంట్లోనూ ఇదే తరహా దొంగతనం జరిగింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే సిసిఎస్, రాజేంద్రనగర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఆనవాళ్లను పరిశీలించారు. ఆ తర్వాత భోజగుట్ట ప్రాంతానికి చెందిన గుంజ పోగు సుధాకర్ అనే వ్యక్తిని అధులోకి తీసుకున్నారు. అతని విచారించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. కేవలం రాజేంద్రనగర్ మాత్రమే కాదు పేట్ బషీర్ బాగ్ రెండు, రాయదుర్గంలో ఒకటి ఇలా మొత్తం ఐదు దొంగతనాలకు అతడు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి 600 గ్రాముల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడికి బండారి శాంసన్, షాన్ దేవ్, సాలోంకే, అమరజీత్ సింగ్, గుంజ పోగు సురేష్ అనే వ్యక్తులు సహకరించారు. వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
పేర్లు మార్చుతాడు
సుధాకర్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు ను పెట్టుకుంటాడు. ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటే.. అక్కడ తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తాడు. చోరీ చేయడానికి ప్రణాళిక రూపొందిస్తాడు. సీసీ కెమెరాల కంటపడకుండా ఉండేందుకు మార్గాలను అన్వేషిస్తాడు. ఆ తర్వాత ద్విచక్ర వాహనాలపై ప్రయాణించి రెక్కీ నిర్వహిస్తాడు. ఆనవాళ్లు లభించకుండా కొన్నిసార్లు బైక్ ను ఒకచోట పెట్టి కాలినడకన వెళ్తుంటాడు.. దొంగతనం చేసేందుకు చోరీ చేసిన వాహనం పై వెళ్తుంటాడు. విగ్గు ధరించి.. మహిళలాగా వేషం వేస్తాడు.. ఒకవేళ సీసీ కెమెరాలో ఆ దృశ్యాలు రికార్డ్ అయినప్పటికీ.. పోలీసులు కనిపెట్టకుండా రకరకాల వేషాలు వేస్తుంటాడు.
పీడియాక్ట్ ప్రయోగించినప్పటికీ..
సుధాకర్ పలుమార్లు దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కాడు. ఈ నేపథ్యంలో ఆసిఫ్ నగర్ పోలీసులు అతనిపై పీడియాట్ ప్రయోగించారు. అతడిని అరెస్టు చేశారు. అయితే అప్పట్లో సుధాకర్ జైలుకు వెళ్ళినప్పుడు బండారి సాంసన్, షాన్ దేవ్, అమర్ జీత్ సింగ్ అనే దొంగలతో పరిచయం ఏర్పడింది. దీంతో వారు ఒక ముఠా లాగా ఏర్పడ్డారు. ఇలా ఇష్టానుసారంగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. దొంగతనం చేసిన సొత్తును మొత్తం సుధాకర్ సోదరుడు సురేష్ కు అందించడం మొదలుపెట్టారు. సురేష్ భోజగుట్ట ప్రాంతంలో నివాసం ఉంటాడు. స్థానికంగా అతడికి మంచి పేరు ఉంది. అయితే అదే ముసుగులో అతడు చోరీ చేసిన సొత్తును విక్రయించి.. తన సోదరుడు సుధాకర్ ముఠా సభ్యులకు అందించేవాడు. ఒకవేళ పోలీసులకు చిక్కితే.. బెయిల్ కోసం కొంత మొత్తం సిద్ధంగా సుధాకర్ ముఠా ఉంచుకుంటారు. వారు అరెస్ట్ కాగానే న్యాయవాది బెయిల్ తో సిద్ధంగా ఉంటాడు. అయితే ప్రస్తుతం సుధాకర్ ముఠాను పోలీసులు రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. అక్కడి న్యాయమూర్తి వారికి జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ తీర్పు చెప్పారు.