Miss India Worldwide 2024: ప్రపంచ అందాల పోటీల్లో పాల్గొనే ముందు.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో వివిధ పోటీలు నిర్వహిస్తారు. వాటిలో విజేతలను ఆయా దేశాలు ప్రపంచ అందాల పోటీకి ఎంపిక చేస్తాయి. ఇక భారత్‌కు సంబంధించి మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. అందాల పోటీలకు సంబందించి ప్రతిష్టాత్మకంగా పరిగణించే టైటిల్స్‌లో ఇది కూడా ఒకటి. ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని చాలా మంది అమ్మాయిలు, మహిళలు ఆసక్తి చూపుతారు. అయితే అందాల కిరీటం అందుకోవాలంటే అందం మాత్రమే ఉంటే చాలదు. అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. తాజాగా అమెరికాలోని న్యూజెర్సీలో నిర్వహించిన మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ పోటీల్లో ఈ మూడు ఉన్న అమ్మాయిలు చాలా మంది పాల్గొన్నారు. అయితే మిస్ ఇండియా వరల్డ్ వైడ్ 2024 కిరీటాన్ని అమెరికాకు చెందిన కంప్యూరట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్ విద్యార్థి ధ్రువీ పాటెల్ దక్కించుకుంది. ‘మిస్ ఇండియా వరల్డ్ వైడ్ టైటిల్ అందుకోవడం అపురూపంగా భావిస్తున్నా. ఇది నా విలువను, ప్రపంచ వ్యాప్తంగా స్ఫూర్తిగా నిలిచే అవకాశాన్ని అందించింది’ అని కిరీటం అందుకున్న తర్వాత ధ్రువి పాటెల్ పేర్కొంది. తాను బాలీవుడ్ నటి అవ్వాలని, యూనిసెఫ్ అంబాసిడర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపింది.
రన్నరప్‌గా..
ఇదిలా ఉంటే.. ఈ పోటీల్లో ఫస్ట్ రన్నరప్‌గా సురినామ్‌కు చెందిన లిసా, సెకండ్ రన్నరప్‌గా నెదర్లాండ్స్‌కు చెందిన మాల్వికా శర్మ నిలిచారు. మిసెస్ కేటగిరీలో ట్రినిడాడ్‌కు చెందిన సుఅన్ మౌటెట్, టొబాగో విజేతలుగా నిలిచారు. యూకేకు చెందిన స్నేహ నంబియార్, పవన్ డిప్ ఫస్ట్, సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇక టీన్ కేటగిరీలో గ్వాడెలూప్ నుంచి సియెర్రా సురెట్ మిస్ టీన్ ఇండియా వరల్డ్‌వైడ్ కిరీటం అందుకుంది. నెదర్లాండ్స్‌కు చెందిన శ్రేయా సింగ్ ఫస్ట్ రన్నరప్‌గా, సురినామ్‌కు చెందిన శ్రద్ధా టెడ్‌జో రెండో రన్నరప్‌గా నిలిచారు.
31 ఏళ్లుగా పోటీలు..
ఇదిలా ఉంటే.. మిస్ ఇండియా వరల్డ్‌వైడ్ అందాల పోటీలను 31 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. ఈ పోటీను ఈ ఏడాది న్యూయార్క్ బేస్డ్ ఇండియా ఫెస్టివల్ కమిటీ నిర్వహించింది. ఇండో అమెరికన్స్ నీలమ్, ధర్మాత్మ శరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.