Indore Court: తల్లికి కుమార్తె భరణం.. ఇండోర్‌ కోర్టు సంచలన తీర్పు!

వృద్ధురాలి పిటిషన్‌పై ఇండోర్‌ కోర్టు విచారణ జరిపింది. కేసు పూర్వపరాలు పరిశీలించింన అదనపు ప్రిన్సిపల్‌ జడ్జి మాయా విశ్వలాల్‌ సంచలన తీర్పు చెప్పారు. వృద్ధురాలికి నెలనెలా రూ.3 వేల భరణం ఇవ్వాలని కూతురును ఆదేశించింది.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 3:48 pm

Indore Court

Follow us on

Indore Court: భార్య భర్తలు విడిపోయిన సమయంలో భార్యకు భరణం ఇవ్వాలని కోర్టులు తీర్పు ఇవ్వడం చూస్తుంటాం. ఇక తల్లిదండ్రుల ఆస్తుల కోసం పిల్లలు కొట్టుకుంటుంటే.. తల్లిదండ్రుల ఆస్తులను వారసులకు ఇవ్వడంతోపాటు తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యతను పిల్లలకు అప్పగిస్తూ గతంలో అనేక కోర్టులు తీర్పు ఇచ్చాయి. అయితే ఇక్కడ తల్లికి కూతురు భరణం ఇవ్వాలని ఆదేశించింది ఇండోర్‌ కోర్టు. వృద్ధాప్యంలో చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూతురుదే అని తేల్చి చెప్పింది.

ఏం జరిగిందంటే..
తనను కూతురు ఇంట్లో నుంచి వెల్లగొట్టిందని మధ్యప్రదేశ్‌కు చెందిన 78 ఏళ్ల వృద్ధురాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తనకున్నది ఒక్కగానొక్క కూతురని, తన భర్త చనిపోయాక ఆమెతోనే ఉంటున్నానని తెలిపింది. భర్త నుంచి తనకు వచ్చిన సొమ్ము, ఇంటిని కూతురు తీసుకుందని పేర్కొంది. తర్వాత ఆమె ఇంట్లోనే చోటు కల్పించిందని తెలిపింది. అయితే కరోనా సమయంలో తనను తీవ్రంగా కొట్టి ఇంట్లో నుంచి గెంటేసిందని పేర్కొంది. .

విచారణ జరిపిన కోర్టు..
వృద్ధురాలి పిటిషన్‌పై ఇండోర్‌ కోర్టు విచారణ జరిపింది. కేసు పూర్వపరాలు పరిశీలించింన అదనపు ప్రిన్సిపల్‌ జడ్జి మాయా విశ్వలాల్‌ సంచలన తీర్పు చెప్పారు. వృద్ధురాలికి నెలనెలా రూ.3 వేల భరణం ఇవ్వాలని కూతురును ఆదేశించింది.

నెలకు రూ.22 వేల ఆదాయం..
ఇదిలా ఉంటే తన కూతురు బట్టల దుకాణం నడుపుతూ నెలకు రూ.22 వేలు సంపాదిస్తుందని తెలిపింది. తనకు తిండి కూడా పెట్టడం లేదని ఇంట్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో కోర్టు భరణంతోపాటు వృద్ధాప్యంలో ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత కూతురుదే అని స్పష్టం చేసింది. తప్పించుకోవాలని చూస్తే కఠిన శిక్ష వేస్తామని కూడా హెచ్చరించింది.