Secret Camera In Bathroom: నేటి కాలంలో ఎవరినీ నమ్మడానికి లేదు.. పైకి మంచిగానే నవ్వుతూ కనిపిస్తారు. లోపల మాత్రం కత్తులు పెట్టుకుంటారు. సరైన సమయంలో తమ పన్నాగాన్ని అమలు చేస్తారు. దొరికిపోతే మాత్రం నక్క వినయాన్ని ప్రదర్శిస్తుంటారు. అటువంటిదే ఈ స్టోరీ కూడా.. హైదరాబాద్ నగరంలో చోటు చేసుకున్న ఈ దారుణం వెలుగులోకి రావడంతో సంచలనంగా మారింది. చివరికి ఈ వ్యవహారం పోలీసుల దాకా వెళ్ళింది.
హైదరాబాద్ లోని వెంగళరావు నగరం ప్రాంతంలో ఓ కుటుంబం బతుకుదెరువు నిమిత్తం వచ్చింది. భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా.. భార్య కూడా స్థానికంగా పనిచేస్తోంది. వీరికి పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల ఆ వివాహిత స్నానం చేస్తుండగా బాత్రూం బల్బ్ హోల్డర్లో ఏదో మెరిసినట్టు కనిపించింది. మొదట్లో ఆమె దానిని అంతగా పట్టించుకోలేదు. ఆ తర్వాత కొద్ది రోజులకు హోల్డర్ కదిలించినట్టు ఉంది. అనుమానం వచ్చిన ఆమె ఆ విషయాన్ని తన భర్తకు చెప్పింది. ఆయన కూడా దానిని పెద్దగా పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని ఇంటి ఓనర్ తో చెప్తే.. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆవివాహిత ఆ విషయాన్ని అంత తేలికగా మర్చిపోలేదు. పైగా హోల్డర్ ను పరిశీలించి చూస్తే దానిని బలవంతంగా కదిలించినట్టు కనిపించింది. దీంతో అందులో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. తను స్నానం చేస్తున్న దృశ్యాలను ఇంటి ఓనర్ రికార్డ్ చేసినట్టు ఆమె గుర్తించింది. వెంటనే ఈ విషయాన్ని తన భర్తతో చెబితే.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
బాత్రూంలో కెమెరా పెట్టడమే కాకుండా.. ఆ వివాహిత స్నానం చేస్తున్న దృశ్యాలను రికార్డు చేయడం పట్ల స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పట్ల ఆ వివాహిత, ఆమె భర్త ఇంటి ఓనర్ ను నిలదీయగా ఆయన దౌర్జన్యానికి దిగాడు. అంతేకాదు ప్రాణాలు తీస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో ఆ వివాహిత ఇంటి ఓనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నా భర్తకు ఏమైనా అయితే మిమ్మల్ని వదిలిపెట్టనంటూ ఇంటి ఓనర్ కు స్పష్టం చేసింది. పోలీసులు ఇంటి ఓనర్ పై మాత్రమే కాకుండా ఎలక్ట్రిషన్ పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఆ కెమెరా ఎక్కడ దాచింది.. అందులో ఉన్న దృశ్యాలను ఏం చేసింది.. ఇంటి ఓనర్ చెప్పడం లేదు.
ఇటీవల కాలంలో చిన్న చిన్న కెమెరాలు ఉపయోగించి ఆడవాళ్ళ ప్రైవేట్ వీడియోలను తీయడం పరిపాటిగా మారింది. పైగా వాటిని అశ్లీల వెబ్ సైట్ లకు విక్రయిస్తున్నారు. భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. వెంగళరావు నగర్ లోని ఇంటి ఓనర్ కూడా ఇలానే చేశాడా? ఒకవేళ చేస్తే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.