Suryapet Police Constable: వాడి వయసు 40 సంవత్సరాలు. పేరు కృష్ణంరాజు.. పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం వెలగబడుతున్నాడు. అతడికి గతంలోనే వివాహం జరిగింది. ఆ వివాహం ఆదిలోనే విచ్చిన్నమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే మరో వివాహం చేసుకున్నాడు. అది కూడా పెటాకులు అయిపోయింది. ముచ్చటగా మూడు వివాహం కూడా చేసుకున్నాడు. అది కూడా విడాకులకు దారి తీసింది. ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ అతడు ఏ బంధంలో కూడా స్థిరంగా నిలబడలేకపోయాడు.. చంచలమైన స్వభావం.. వేధించే వ్యక్తిత్వం ఉన్న అతడు నిత్య పెళ్లి కొడుకులా మారిపోయాడు.
Also Read: ఎల్బ్రస్ శిఖరంపై తానా విశ్వ గురుకులం పతాకం
40 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం సూర్యాపేట జిల్లా సపావత్ తండాకు చెందిన 13 సంవత్సరాల బాలికను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగేటప్పటికీ ఆ బాలిక వయస్సు కేవలం 13 సంవత్సరాలు. గతంలో జరిగిన వివాహాల గురించి కృష్ణంరాజు చెప్పలేదు. పైగా తనకు భారీగా ఆస్తి ఉందని.. త్వరలోనే ప్రమోషన్ లభిస్తుందని చెప్పడంతో.. ఆ బాలిక తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు.. అయితే ఇటీవల కృష్ణంరాజు వ్యవహారం తెలియడంతో ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై మీడియాలో కూడా వార్తలు రావడంతో అధికారులు స్పందించారు. 2012 బ్యాచ్ కు చెందిన కృష్ణంరాజును ఉన్నతాధికారులు విధుల నుంచి సస్పెండ్ చేశారు.
13 సంవత్సరాల బాలికను పెళ్లి చేసుకున్న నేపథ్యంలో అతనిపై బాలల సంక్షేమ శాఖ అధికారులు చైల్డ్, మ్యారేజ్, ప్రోవిజన్ చట్టం కింద అత్యాచారం, పోక్సో కేసు నమోదు చేశారు. అయితే కృష్ణంరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. కృష్ణంరాజు స్వస్థలం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం తుల్జారావుపేట. గతంలో మూడు వివాహాలు చేసుకున్న ఇతడు.. అన్ని సందర్భాలలో విమర్శలు ఎదుర్కొన్నాడు. కట్టుకున్న భార్యలను ఇబ్బంది పెట్టడం.. వేధించడాన్ని నిత్య కృత్యంగా పెట్టుకున్నాడు. అందువల్లే ఇతడు నిత్య పెళ్లి కొడుకుగా అవతరించాడు.. చివరికి ఆ బాలిక విషయంలో ఇతడి వ్యవహారం బయటికి రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.