Nexa Evergreen fraud case: ఏ వ్యాపారంలో అయినా నమ్మకం అనేది చాలా ముఖ్యం. ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వ్యాపారాన్ని సాగించడం కత్తిమీద సాము లాంటిది. అయితే ఇంతటి సాహసాన్ని అందరూ చేయరు. చేయలేరు. కొందరైతే వ్యాపారం పేరుతో జనాలను నిండా ముంచుతారు. లాభాలు వస్తాయని అరచేతిలో స్వర్గం చూపిస్తారు. ఆ తర్వాత మోసం చేయగా వచ్చిన డబ్బులతో ఉడాయిస్తారు. ఈ సంఘటన కూడా అలాంటిదే. కాకపోతే ఈ వ్యవహారంలో ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా 2700 కోట్లు వసూలు చేసి.. బోర్డు తిప్పేశారు. అయితే మన దేశంలో ఇలాంటి సంఘటనలు ఇటీవల కాలంలో సర్వ సాధారణమైపోయినప్పటికీ.. ఈ కేసులో మాత్రం ఇద్దరన్నదమ్ములు చేసిన దందా మామూలుగా లేదు. వారు చేసిన మోసం ఓ స్థాయిలో ఉంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
మనదేశంలో స్థిరాస్తి వ్యాపారం ఎక్కడైతే జోరుగా సాగుతుందో.. అక్కడే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అలాంటిదే ఇది కూడా… రాజస్థాన్ రాష్ట్రంలోని సికర్ జిల్లాలో సుభాష్ బీజారాణి, రణ్ వీర్ బీజా రాణి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. వీరిద్దరూ నెక్సా ఎవర్ గ్రీన్ అనే కంపెనీని ప్రారంభించారు. తమ కంపెనీ ఆధ్వర్యంలో గుజరాత్ లోని దోలేరా స్మార్ట్ సిటీలో వెంచర్ వేశామని.. తమ నిర్మిస్తున్న ఫ్లాట్లపై పెట్టుబడి పెడితే రెట్టింపు ఆదాయం వస్తుందని నమ్మబలికారు. కేవలం ప్రజలను మాత్రమే కాదు తమ కంపెనీలో ఉన్న ఇన్వెస్టర్లను.. చివరికి వివిధ శాఖలలో పనిచేసే అధికారులను సైతం మోసం చేశారు. దాదాపు 70 వేల మంది నుంచి 2700 కోట్ల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ప్లాట్లు చూపించమంటే రేపు మాపు అంటూ కాలం గడిపారు. వీరి వ్యవహార శైలి పట్ల అనుమానం వచ్చినవారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే ఆ కంపెనీ బోర్డు తిప్పడంతో మోసం జరిగిందని గుర్తించారు. స్థానికంగా ఉన్న పోలీసులు దర్యాప్తు చేస్తుంటే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూడడం.. వేలకోట్లలో స్కామ్ కావడంతో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు..
70 వేల మందిని మోసం చేసిన నేపథ్యంలో.. వారు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసిన విధానం.. ఏ రూపంలో డబ్బు చెల్లించారు.. సుభాష్, రణ్ వీర్ డబ్బు ఎలా స్వీకరించారు.. అనే విధాలుగా కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందులో హవాలా కోణాన్ని కూడా వారు ప్రధానంగా పరిశీలిస్తున్నారు.. మొత్తంగా చూస్తే ఈ వ్యవహారంలో పెద్ద పెద్ద తలకాయలకు కూడా ప్రమేయం ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసు రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. దాదాపు 2,700 కోట్ల మోసానికి పాల్పడిన ఆ వ్యక్తులు పరారీలో ఉన్నారా? దర్యాప్తు సంస్థల అధికారుల అదుపులో ఉన్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.