Sheikh Riyaz criminal history: దొంగతనాలు, హత్యలు, అఘాయిత్యాలు, బెదిరింపులు, దోపిడీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నేరాలు. ఇన్ని నేరాలకు పాల్పడింది ఒకే ఒక్కడు. అతని పేరు రియాజ్. చూసేందుకు అమాయకంగా.. పక్కింటి కుర్రాడి మాదిరిగా ఉంటాడు. కానీ చేసేవన్నీ కూడా దారుణాలు.. కొంతమంది రాజకీయ పార్టీ నాయకులు రియాజ్ ను తమ అవసరాల కోసం వాడుకున్నారు. అందువల్లే అతడు ఇన్ని నేరాలు చేసినప్పటికీ ఏమీ కాలేదు. పైగా పోలీస్ స్టేషన్ అనేది అతడికి అత్తారిల్లు మాదిరిగా మారిపోయింది. రాజకీయ నాయకులు ఇచ్చిన సపోర్టుతో అతడు ఏకంగా నిజామాబాద్ జిల్లాలో నయీమ్ మాదిరిగా రెచ్చిపోయాడు. వరుస దారుణాలకు పాల్పడుతూ పోలీసులకు సైతం చుక్కలు చూపించాడు. అయితే చివరికి అతని పాపం పండింది.
ఇటీవల ఓ కేసు విచారణ నిమిత్తం రియాజ్ ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ తన ద్విచక్ర వాహనంపై తీసుకెళ్తుండగా.. తన వెంట ఉన్న కత్తితో కానిస్టేబుల్ మీద దాడి చేశాడు. అత్యంత దారుణంగా పొడిచాడు. సభ్య సమాజం చూస్తుండగానే రియాజ్ ఆ పని చేశాడు. కనీసం అతడిని నిలువరించే ప్రయత్నం చుట్టుపక్కల ఉన్నవారు చేయకపోవడంతో మరింత రెచ్చిపోయాడు. అంతేకాదు అత్యంత దారుణంగా పొడిచి పారిపోయాడు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రమోద్ అతడిని ప్రతిఘటించాడు. ఈ పెనుగులాటలో రియాజ్ కూడా గాయపడ్డాడు.
ప్రమోద్ పై దాడి చేసిన
తర్వాత రియాజ్ నిజామాబాద్ నగరంలోని ఓ ప్రాంతంలోకి వెళ్లిపోయాడు. ప్రమోద్ చికిత్స పొందుతూ చనిపోయిన తర్వాత.. పోలీసులు రియాజ్ ను పట్టుకోవడానికి బృందాలుగా విడిపోయారు. నిజామాబాద్ నగరాన్ని జల్లెడ పట్టారు. అంతేకాదు జన సమర్థ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు మొత్తం పరిశీలించారు. చివరికి రియాజ్ ఆచూకీ తెలియడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అదే అప్పటికే అతనికి గాయం కావడంతో.. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా.. ఆసుపత్రి నుంచి పారిపోవడానికి రియాజ్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలోనే రియాజ్ తనకు రక్షణగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న తుపాకిని తీసుకొని కాల్చేందుకు ప్రయత్నించాడు. దీంతో మిగతా పోలీసులు ఆత్మ రక్షణ కోసం కాల్పులు మొదలు పెట్టడంతో రియాజ్ చనిపోయాడు.
రియాజ్ ద్విచక్ర వాహనాలను చోరీ చేయడంలో దిట్ట. అంతేకాదు నేరస్థులకు అండగా ఉండడంలో నేర్పరి. పైగా ఇతడిది కరడి కట్టిన మనస్తత్వం. చూసేందుకు అమాయకుడి మాదిరిగా ఉన్నప్పటికీ.. నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు.. చివరికి పోలీసులు జరిపిన కాల్పులలో రియాజ్ చనిపోయాడు. దీంతో ప్రమోద్ కు అసలైన నివాళి లభించిందని.. అతని ఆత్మకు ఇప్పుడు శాంతి కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమోద్ పై కత్తితో దాడులు చేస్తున్నప్పుడు.. అడుక్కోడానికి ప్రయత్నించిన ఎస్ఐపై కూడా అతడు దాడి చేశాడు. కాకపోతే ఎస్ఐ కి స్వల్ప స్థాయిలో గాయాలయ్యాయి.. చైన్ స్నాచింగ్, దొంగతనాలు, గొడవలు ఇలా చెప్పుకుంటూ పోతే నిజామాబాద్ నగరంలో రియాజ్ అనేక నేరాలకు పాల్పడ్డాడని పోలీసులు చెబుతున్నారు.