Thorrur Journalists: ఉదయం లేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నమస్తే తెలంగాణ, టీ న్యూస్.. దాని అనుబంధ సోషల్ మీడియా గ్రూపులు కుమ్మరించే బురద టన్నుల్లో ఉంటుంది. బాధ్యత గల మీడియాగా ప్రభుత్వ తప్పులను బయటపెట్టాలి. కానీ ప్రభుత్వం చేసే ప్రతి పనిని తప్పు అనడాన్ని నమస్తే తెలంగాణ, టీ న్యూస్ ఒంట పట్టించుకున్నాయి. గతంలో రేవంత్ మీద అడ్డగోలుగా కథనాలను ప్రసారం చేస్తున్న ఈ మీడియా సంస్థలు.. ఇటీవల కాలంలో పూర్తిగా బరితెగించి పోయాయి. అన్నిటికంటే ముఖ్యంగా గులాబీ పార్టీ సోషల్ మీడియా ఛానల్స్ అయితే దారుణంగా ప్రవర్తిస్తున్నాయి.
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా అన్నట్టుగా.. నమస్తే తెలంగాణ, టీ న్యూస్ యాజమాన్యాలు ప్రభుత్వం తీవ్రస్థాయిలో దుమ్ము ఎత్తిపోస్తుంటే.. అందులో పని చేస్తున్న పాత్రికేయులు మాత్రం వసూళ్లకు పాల్పడుతున్నారు. అంతేకాదు, ఏకంగా అధికారుల అవతార ఎత్తి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు . వీరి వ్యవహారాన్ని పసిగట్టిన పోలీసులు మొత్తానికి ఆట కట్టించారు. అంతేకాదు వారి దగ్గర నుంచి నగదు స్వాధీనం చేసుకొని, జైలుకు పంపించారు.
తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరు పట్టణానికి చెందిన నమస్తే తెలంగాణ, టీ న్యూస్ రిపోర్టర్లు, సిగ్నేచర్ స్టూడియో అనే యూట్యూబ్ ఛానల్ యాంకర్ అక్రమ వసూళ్లకు పాల్పడి పోలీసులకు పట్టుబడ్డారు. తొర్రూరు పట్టణానికి చెందిన నమస్తే తెలంగాణ విలేకరి పోల్ రాజ్, టీ న్యూస్ రిపోర్టర్ శీలం సుమంత్, సిగ్నేచర్ స్టూడియో యాంకర్ జాటోత్ ఉపేందర్ సులభంగా డబ్బు సంపాదనకు అలవాటు పడ్డారు. ఇందులో భాగంగానే దందాలకు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికలు రావడంతో .. వీరు ముగ్గురు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులుగా మారిపోయారు. ఉపేందర్ కారుకు పోలీస్ సైరన్ ఏర్పాటు చేసుకొని.. ఆయా గ్రామాలలో అధికారుల పేరుతో హడావిడి చేశారు. ప్రచారం కోసం తిరిగిన పార్టీ కార్యకర్తలకు విందు ఇవ్వాలని సర్పంచ్ అభ్యర్థులు మద్యం సీసాలు తీసుకువెళ్తుంటే.. వారిని వెంబడించారు.. బెదిరింపులకు గురి చేసి గ్రామాలలో డబ్బులు వసూలు చేశారు. తొర్రూరు, వంగర ప్రాంతాలలో వీరు ఇష్టానుసారంగా వ్యవహరించారు. బెదిరింపులకు పాల్పడి.. భారీగా సంపాదించారు.
గడిచిన నెల 11వ తేదీన సాయంత్రం 4: 30 నిమిషాలకు ములుగు మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ ఆనంద్.. పెద్ద వంగర లో ఉన్న తన బంధువులకు ఇంటికి వెళ్తున్నాడు. ఇదే క్రమంలో తొర్రూర్ దగ్గర ఉన్న పాలకేంద్రం సమీపంలో ఉన్న వైన్ షాపులో మద్యం కొనుగోలు చేసి.. కారులో వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజు, సుమంత్, ఉపేందర్ పోలీస్ సైరన్ ఉన్న కారులో అతడిని వెంబడించారు. దారి మధ్యలో అడ్డగించారు. తమను తాము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. కారును తనిఖీ చేయాలని బెదిరించారు. కారులో మద్యం ఉండడంతో.. ఎన్నికల్లో పంచడానికి తీసుకెళ్తున్నావని అతనిపై బెదిరింపులకు దిగారు. అంతేకాదు కేసు నమోదు చేయాల్సి వస్తుందని, లక్ష రూపాయలు ఇస్తేనే వదిలిపెడతామని పేర్కొన్నారు.
ఒత్తిడికి గురైన ఆనంద్ అప్పటికప్పుడు తన బామ్మర్దికి ఫోన్ చేసి.. లక్ష రూపాయలు సర్దుబాటు చేశాడు. ఆనంద్ కారును నిర్బంధించినప్పుడు సుమంత్, రాజు అయ్యప్ప మాలలో ఉన్నారు. ఉపేందర్ సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. వీరిలో ఉపేందర్ స్వస్థలం వెలికట్ట గ్రామ శివారు పెద్ద మంగ్యా తండా పరిధిలోని కేషా తండా. ఇతడు హైదరాబాదు లో సిగ్నేచర్ పేరుతో నడుస్తున్న ఓ యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్నాడు.
పోల్ రాజు ది యాదగిరి మండలం వడ్డకొండ గ్రామం. ఇతడు తొర్రూరు బస్టాండ్ లో కార్గో పార్సెల్ సర్వీస్ సెంటర్ నిర్వహిస్తాడు. ఇటీవల నమస్తే తెలంగాణ పత్రికకు తొర్రూరు బీట్ చూసే రిపోర్టర్ గా నియమితుడయ్యాడు.
శీలం సుమంత్ తొర్రూరు మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందినవాడు. ఇతరు టీ న్యూస్ రిపోర్టర్ గా పని చేస్తున్నాడు . గత నెల 12న ఉపేందర్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. ఈనెల 16న రాజు ను అరెస్ట్ చేశారు.
పరారీలో ఉన్న సుమంత్ ను ఈనెల 29న అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. వీరంతా కూడా మహబూబాబాద్ సబ్ జైల్లో ఉన్నారు. వసూళ్ల కోసం ఉపేందర్ కారును వాడిన నేపథ్యంలో.. ఆ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పలువురు బాధితుల దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులలో ఉపేందర్ దగ్గర నుంచి 50వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సెల్ ఫోన్ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రాజు నుంచి 25000, సుమంత్ నుంచి 25,000, ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాత్రికేయుల ముసుగులో అడ్డగోలు పనులు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదని తొర్రూరు ఎస్సై ఉపేందర్ పేర్కొన్నారు.