Daughter Love Marriage: నేటి కాలంలో ప్రేమ వివాహాలు సర్వసాధారణంగా మారిపోయాయి. అడ్డు చెప్పిన కుటుంబ సభ్యులను లెక్కచేయకుండా యువతి యువకులు ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. పైగా ఇటీవల కాలంలో ప్రేమ వివాహాలలో సినిమాలను మించి మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దాడులకు దిగడం.. ప్రతిదాడులకు వెనుకాడకపోవడం.. దారుణాలకు పాల్పడడం వంటి ఘటనలు ప్రేమ వివాహాల సమయంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
ఇన్ని ఘటనలు జరుగుతున్నప్పటికీ తమ పిల్లల మనస్తత్వాలను పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారు. పెద్దలకు తగ్గట్టుగా పిల్లలు ఉండలేకపోతున్నారు. ఇలా పరస్పరం ఘర్షణ పూరితమైన వాతావరణంలో ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాలలో ప్రేమ వివాహాలలో ఊహించని దారుణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనల వల్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇన్ని జరుగుతున్నప్పటికీ పిల్లల్లో మార్పు రావడం లేదు. పెద్దలకు జ్ఞానోదయం కలగడం లేదు.
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాకు చెందిన ముత్తుకుమార్ అనే యువకుడు గుంటూరు జిల్లాకు చెందిన మాధవి అనే యువతిని గత నెల 16న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం మాధవి కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు వాహనాలలో వచ్చారు. ముత్తుకుమార్ ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకుని నేరుగా అక్కడికి వెళ్లారు. తమ కూతురిని వాహనంలో ఎక్కించుకొని బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూస్తుంటే ప్రేమిస్తే సినిమా మాదిరిగా కనిపించిందని చుట్టుపక్కల వారు అంటున్నారు. వచ్చిన వారంతా ప్రత్యేకమైన వాహనాలలో.. మందీ మార్బలం తో కనిపించారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు.
తమ ఇంటి మీదికి వచ్చి.. తమ కుమారుడు వివాహం చేసుకున్న అమ్మాయిని అలా బలవంతంగా తీసుకెళ్లడం పట్ల ముత్తుకుమార్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు మాధవిని తీసుకెళ్తున్న సమయంలో ఆమె కుటుంబ సభ్యులు ముత్తుకుమార్, అతని కుటుంబ సభ్యుల మీద దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అంతేకాదు దాడికి సంబంధించిన దృశ్యాలు కూడా సమీపంలో ఉన్న సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీంతో ముత్తుకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన మల్యాల ప్రాంతంలో సంచలనం సృష్టించింది.
ముత్తుకుమార్ తో ప్రేమ వ్యవహారం మాధవి ఇంట్లో ఇటీవల తెలిసింది. దీంతో ఆమెను బయటికి వెళ్లకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్త పడ్డారు. అయితే మాధవి ఇంట్లో వాళ్లకు తనకు అనారోగ్యంగా ఉందని చెప్పి బయటకు వచ్చింది. ముత్తు కుమార్ ఆమెను అక్కడి నుంచి జగిత్యాల తీసుకువచ్చాడు. తన కుటుంబ సభ్యుల అండదండలతో గత నెల 16న కొండగట్టు ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మాధవి కుటుంబ సభ్యులు ప్రత్యేకమైన వాహనాల వచ్చి ఆమెను తీసుకెళ్లారు. చివరికి ముత్తుకుమార్ కుటుంబ సభ్యులపై దాడి కూడా చేశారు.