Kanpur Crime News: నేటి కాలంలో దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఉండడం లేదు. కలకాలం కలిసి జీవించాలనే కోరిక ఎవరిలోనూ ఉండడం లేదు. ఇష్టానుసారమైన జీవితానికి అలవాటు పడుతూ.. దారుణాలకు పాల్పడుతున్నారు. జీవిత భాగస్వాములను మోసం చేయడానికి.. అవసరమైతే అంతం చేయడానికి వెనుకాడడం లేదు.. ఈ తరహా ఘటనలు దేశవ్యాప్తంగా ఇటీవల పెరిగిపోయినప్పటికీ.. పోలీసులు ఆ ఘటనలలో నిందితులను పట్టుకొని జైలుకు పంపిస్తున్నప్పటికీ.. చాలా మదిలో మార్పు రావడం లేదు. పైగా మరింత ఘోరంగా దారుణాలకు పాల్పడుతూ సమాజంలో మిగతావారిలో భయభ్రాంతులు కలగజేస్తున్నారు.
అది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం. కాన్పూర్ నగరంలోని మహారాజపూర్ పోలీస్ స్టేషన్.. ఆ పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. ” సార్ నా భార్యను నేను అంతం చేశాను. ఆమె మృత శరీరం ఇంట్లోనే ఉంది. నేను చెప్పిన అడ్రస్ వద్దకు మీరు వస్తే ఆమె శవాన్ని తీసుకెళ్లొచ్చు. నేను మీ ఎదుట లొంగిపోతాను” అని అతడు ఫోన్లో చెప్పాడు. అతడు చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న పోలీసులు.. అక్కడికి వెళ్లారు. పోలీసులు వెళ్లిన తర్వాత అక్కడ దృశ్యాలు చూసి షాక్ అయ్యారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పతేహ్ పూర్ ప్రాంతానికి చెందిన సచిన్, శ్వేత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కోర్టులో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కాన్పూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సచిన్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు. ఇటీవల శ్వేత అకౌంట్లో విడతలవారీగా భారీగా నగదు జమ అవుతోంది. పైగా శ్వేత తమ పొరుగింటి యువకులతో అత్యంత చనువుగా ఉంటోంది. ఇది సచిన్ కు ఏమాత్రం నచ్చలేదు. దీంతో శ్వేతను అతడు నిలదీశాడు. ఆ సమయంలో అక్కడ ఇద్దరు యువకులు కూడా ఉన్నారు. వారు సచిన్ తో గొడవపడ్డారు. దీంతో సచిన్ పోలీసులకు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి కౌన్సిలింగ్ ఇచ్చారు. భార్యాభర్తలిద్దరినీ కలిపారు.
మళ్లీ కొద్ది రోజులకు అదే పనిగా శ్వేత అకౌంట్లో డబ్బులు జమవుతున్నాయి. దీంతో సచిన్ మరోసారి నిలదీశాడు. ఈసారి శ్వేత తన విశ్వరూపం చూపించింది. ఆ యువకులతో కలిసి ఉంటానని తెగేసి చెప్పింది. నన్ను చంపినా సరే వాళ్లతోనే కలిసి ఉంటానని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సచిన్ ఆగ్రహంతో శ్వేత గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తర్వాత నాలుగు గంటల పాటు నగరం మొత్తం తిరిగాడు. చివరికి పశ్చాతాపంతో పోలీసులకు ఫోన్ చేశాడు.
