Uttar Pradesh crime ఇన్ని రోజుల పాటు మన దేశంలో జరిగిన నేరాలు ఏదో ఒక కారణంతో చోటుచేసుకున్నాయి. భర్త నచ్చలేదనో.. ప్రియుడు ఉన్నాడనో.. ఆస్తి కోసమో.. ఇంకా కారణంతోనో మహిళలు దారుణాలకు పాల్పడ్డారు.. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలలో దారుణాలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ కేసులలో భర్తలు భార్యల చేతిలో ప్రాణాలు వదిలారు. అయితే ఇప్పుడు మీరు చదవబోయే కథనం మాత్రం పూర్తి విభిన్నమైనది. ఎందుకంటే జరిగిన సంఘటన అటువంటిది కాబట్టి.
అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం.. కౌశంబి జిల్లా.. ఆ జిల్లాలోని మల్కియా బాజాం కుర్రాం అనే గ్రామంలో మాలతి దేవి అనే వివాహిత తన భర్త బ్రిజేష్ కుమార్ తో కలిసి జీవిస్తోంది. వీరిది ఉమ్మడి కుటుంబం. అయితే ఈ కుటుంబంలో ఆస్తుల సంబంధించి నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. ఈ గొడవల వల్ల మాలతి దేవికి మనశాంతి అనేది లేకుండా పోయింది. భర్తకు ఈ విషయం చెప్పిన సరే అతడు పట్టించుకోవడం లేదు. పైగా ఇటీవల మాలతి దేవిని ఆమె వదిన తీవ్రంగా దూషించింది. ఆస్తి విషయంలో అడ్డగోలుగా మాట్లాడింది. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడిన నేపథ్యంలో మాలతి దేవి తీవ్రమైన నిర్వేదంలో కూరుకుపోయింది. ప్రతిసారి తనను దోషిగా చిత్రీకరించడం పట్ల మాలతి దేవి తట్టుకోలేకపోయింది. ఫలితంగా తన తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగితో ఈ విషయం తెలిపింది. దీంతో వారు ఒక ప్రణాళిక రూపొందించారు. కుటుంబం మొత్తాన్ని లేపేయాలని స్కెచ్ గీశారు..
ప్రణాళికలో భాగంగా మాలతి దేవి గోధుమపిండిలో విషం కలిపింది. వాటితోనే రోటీలు చేసింది. ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు వడ్డించడానికి ప్రయత్నిస్తుండగా.. రోటీల నుంచి విచిత్రమైన వాసన రావడంతో మాలతి దేవి వదిన గుర్తించింది. రోటిలపై అనుమాన వ్యక్తం చేసింది. దీనిపై మాలతి దేవిని నిలదీసింది. దీంతో ఆమె అసలు విషయం ఒప్పుకుంది. ఫలితంగా మాలతి దేవి భర్త బ్రిజేష్ కుమార్ వెంటనే కరారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాలతి దేవిని ఆమె తండ్రి ప్రసాద్, సోదరుడు బజరంగిని అదుపులకు తీసుకున్నారు. విషం కల్పిన గోధుమపిండిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టడానికి ప్రయత్నిస్తుండగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు.
“మాలతి దేవి కుటుంబంలో నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఆ ఇంట్లో గొడవలు తట్టుకోలేక ఆమె ఈ పని చేసినట్టుంది. అంతటి దారుణానికి ఒడి కట్టడం ముమ్మాటికి నేరమే. ఆమె సున్నిత మనస్కురాలు. ఆమెను అనవసరంగా ఇబ్బంది పెట్టి ఇలా చేశారు. గోధుమపిండిలో క్రిమిసంహారక మందు కలపడం వల్ల ఇంటి మొత్తాన్ని చంపాలి అనుకోవడం మాత్రం దుర్మార్గమైన చర్య అని” చుట్టుపక్కల వారు వ్యాఖ్యానిస్తున్నారు.