Srikakulam: ఎనిమిది మంది ఒక ముఠాగా ఏర్పడ్డారు. మారుమూల గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఆ ఇంట్లో చిన్నపాటి ఉపాధి పరిశ్రమను ఏర్పాటు చేసుకున్నారు. ఆ గ్రామస్తులు కూడా వారు ఏదో ఒక పని చేసుకుంటున్నారులే అని భావించారు. అయితే కొద్ది నెలలుగా ఇదే తతంగం నడుస్తోంది. అయితే ఉన్నట్టుండి ఆ 8 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పుడు కానీ ఆ గ్రామస్తులకు అసలు విషయం తెలియలేదు. ఒకటి కాదు రెండు కాదు లక్షలాది రూపాయల నకిలీ కరెన్సీ ఆ ఇంట్లో పట్టుబడడంతో ఉలిక్కిపడ్డారు ఆ గ్రామస్తులు. శ్రీకాకుళం జిల్లాలో వెలుగు చూసింది నకిలీ కరెన్సీ ఉదంతం. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఏకకాలంలో రెండు చోట్ల రూ.72.25 లక్షల నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
* మెలియాపుట్టి మండలంలో..
మెలియాపుట్టి మండలం ఒడిస్సా కు సరిహద్దు ప్రాంతం. అదే మండలంలో పట్టుపురం జంక్షన్ ను స్థావరంగా ఏర్పాటు చేసుకున్నారు నిందితులు. అక్కడే ఓ ఇంటిని స్థావరం గా మార్చుకున్నారు. దొంగ నోట్ల తయారీకి ఉపయోగించిన మిషనరీ, ఇతర సామాగ్రిని అమర్చుకున్నారు. ఒడిస్సా నుంచి నకిలీ నోట్లు తెచ్చి వాటిని కలర్ జిరాక్స్ మిషన్లో జిరాక్స్ తీసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. రూ.5 లక్షల రూపాయల నగదు తీసుకుని.. అందుకు బదులుగా రూ.25 లక్షల కరెన్సీని ముట్ట చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ తతంగం నడుస్తోంది . ముందుగా ఈ కేసులో ఏ వన్ నిందితుడిగా భావిస్తున్న తమ్మిరెడ్డి రవి పట్టుబడ్డాడు. దీంతో ఆయన మిగతా ఐదుగురు పేర్లు చెప్పడంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.
* మరో ఇద్దరు యువకులు..
ఇదే జిల్లాలోని జి. సిగడం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ఇద్దరు వ్యక్తులు 15 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ తో పట్టుబడ్డారు. పెనసాం జంక్షన్ వద్ద ముందస్తుగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని తనిఖీ చేయగా 15 లక్షల రూపాయలు లభ్యమయింది. దానిని నకిలీ కరెన్సీగా గుర్తించారు పోలీసులు. గనగళ్ల రవి, రాజేష్ అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఏకకాలంలో శ్రీకాకుళం జిల్లాలో నకిలీ కరెన్సీ పెద్ద ఎత్తున పట్టుబడడం ఆందోళన కలిగిస్తోంది.