Cyber Frauds: అరచేతిలో స్మార్ట్ ఫోన్.. అపరిమితమైన డేటా.. అన్ని పనులు ఆ ఫోన్ నుంచే.. మాట్లాడే మాటల నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాల వరకు ప్రతి ఒక్కటి దాని ద్వారానే సాగిపోతోంది. అయితే మంచి వెనుక చెడు ఉన్నట్టు.. ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా చేపట్టే వ్యవహారాలలో సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. సేమ్ అభిమన్యుడు సినిమాలో లాగా మనకు తెలియకుండానే మన ఖాతాలో నుంచి డబ్బులు, ఇతర కీలక సమాచారాన్ని తస్కరిస్తున్నారు.. ఒక నివేదిక ప్రకారం తెలంగాణ నుంచి రోజు ఐదు కోట్ల చొప్పున ఏడాదికి ₹1,500 కోట్ల దాకా సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని తెలుస్తోంది. కర్ర విరగడం లేదు, పాము చావడం లేదు, నెత్తురు చుక్క చిందడం లేదు.. అన్న తీరుగా సైబర్ నెరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన టాప్ – 5 సైబర్ నేరాల్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ముందు వరసలో ఉన్నాయి.
ప్రజలు సులభంగా సంపాదించేందుకు అలవాటు పడటం సైబర్ నేరగాళ్లకు కలిసి వస్తోంది. దీనినే వారు అదునుగా చూసుకొని దండిగా సంపాదిస్తున్నారు. పోలీసులు ఎన్ని రకాలుగా అవగాహనలు కల్పించినప్పటికీ సైబర్ నేరగాళ్లు రోజుకొక కొత్త ఎత్తుగడతో రెచ్చిపోతున్నారు.. ఒక తెలంగాణ నుంచే ₹1,500 కోట్ల దాకా దోచేస్తున్నారంటే ఇక దేశవ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ సైబర్ నేరగాళ్ల వలలో ఎక్కువగా యువత చిక్కుకుంటుండడం విశేషం. “ఫలానా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ ఖాతాలో డబ్బు ఫ్రీజ్ అయిందని.. మీ ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలని.. లేదా మీకు పలానా ప్రాంతం నుంచి కొరియర్ వచ్చిందని.. అది కస్టమ్స్ లో చిక్కుకుపోయిందని.. చెప్పిన నెంబర్ కు డబ్బు పంపిస్తే వెంటనే రిలీజ్ చేస్తామని..” ఇలా రకరకాల మోసపూరిత మాటలతో సైబర్ నేరగాళ్లు అమాయకులను దోచుకుంటున్నారు. ఇక ఇటీవల సరికొత్త ఎత్తుగడలకు తెర తీశారు.
ప్రస్తుతం ఐపీఎల్ జోరుగా సాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ కు అలవాటు పడిన వారిని గుర్తించి.. వారికి ఈజీ మనీకి అలవాటు చేస్తున్నారు. అనంతరం బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్ళిస్తున్నారు. వారి ద్వారా వెయ్యి నుంచి పెట్టుబడి పెట్టించి లక్షలు, కోట్లల్లో మోసం చేస్తున్నారు. ఇక ఓటిపి ఫ్రాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడ్ ఎక్స్ కొరియర్ సర్వీసెస్.. సె* టార్షన్ వంటి మోసాలతో సైబర్ నేరగాళ్లు అడ్డగోలుగా మోసం చేస్తున్నారు.. ఇలాంటి క్రమంలో ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని.. ముఖ్యంగా అపరిచిత ఫోన్ కాల్స్ లో ఎట్టి పరిస్థితుల్లో బ్యాంకు వివరాలు చెప్పొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫోన్ అప్డేట్ చేసుకోవాలని.. నిషేధిత సైట్స్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు పలుకుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Do you know how and how much cyber criminals are robbing you without your knowledge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com