MLA Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కొత్త చట్టం దెబ్బ

మంగళవారం కరీంనగర్ జెడ్పి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : July 3, 2024 11:35 am

MLA Padi Kaushik Reddy

Follow us on

MLA Padi Kaushik Reddy: బ్రిటిష్ కాలం నాటి వలస చట్టాలకు చరమగీతం పాడుతూ.. భారత ప్రభుత్వం సరికొత్త న్యాయ చట్టాలను తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పలు సెక్షన్లను మార్చింది. నేరాల నిర్వచనాన్ని పూర్తిగా మార్చింది. పలు కేసుల సెక్షన్లకు సరికొత్త అర్ధాన్నిచ్చింది. మంగళవారం నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి.. కొత్త చట్టంలో భాగంగా మొదటి కేసు ఢిల్లీలో నమోదు కాగా.. తెలంగాణ రాష్ట్రం విషయానికొస్తే బుధవారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించడంతో.. మంగళవారం అమల్లోకి వచ్చిన చట్టం కింద పాడి కౌశిక్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన భారత న్యాయ సంహిత సెక్షన్ 122, 126 (2) కింద పోలీసులు కౌశిక్ రెడ్డి పై కేసులు నమోదు చేశారు.

ఏం జరిగిందంటే..

మంగళవారం కరీంనగర్ జెడ్పి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అడ్డుకున్నారు. ఆమె బయటికి వెళ్లకుండా దారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.. మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ ఆధ్వర్యంలో చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పమేలా సత్పతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ సభ్యులు లేవనెత్తిన సమస్యలను కలెక్టర్ విన్నారు. సంబంధిత అధికారులను నోట్ చేసుకోవాలని సూచించారు.

ఈ సమావేశానికి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరయ్యారు. ” ఇటీవల నేను మండల విద్యాశాఖ అధికారులతో విద్యాశాఖ ప్రగతి పై సమీక్ష నిర్వహించాను. అందులో పాల్గొన్న ఎంఈఓ లకు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు మెమొలు జారీ చేశారని” కౌశిక్ రెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు డిఈఓ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో మొత్తం గందరగోళం నెలకొనగా.. కలెక్టర్ పమేలా సత్పతి తన కుర్చీలో నుంచి లేచి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి ఆమె ఎదుట బైఠాయించారు. బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి వాగ్వాదం జరిగింది. చాలాసేపటి తర్వాత కలెక్టర్ తన కార్యాలయానికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, కాంగ్రెస్ జడ్పిటిసిలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. అయితే జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ.. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.