Fraud: సార్.. మా అమ్మకు ఆరోగ్యం బాగోలేదు.. నేను డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తాను.. నాకు లిక్విడ్ ఇస్తారా?

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసేవాడు. సరిగా పనిచేయకపోవడం, జల్సాలకు అలవాటు పడటంతో యాజమాన్యం అతడిని తొలగించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 15, 2024 4:42 pm

Fraud

Follow us on

Fraud: రోజురోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమార్కులు రకరకాల దారుణాలకు పాల్పడుతున్నారు. ఒకప్పుడు ప్రతి వ్యవహారం నగదు రూపంలోనే సాగేది. ఇప్పుడు పూర్తి డిజిటల్ రూపాన్ని సంతరించుకుంది. ఇదే సమయంలో అక్రమార్కులు కొన్ని కొన్ని లొసుగులను తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. అడ్డగోలుగా డబ్బులు సంపాదిస్తూ.. అమాయకులను బురిడి కొట్టిస్తున్నారు. పోలీసులు, ఇతర నిపుణులు ఎన్ని రకాలుగా సూచనలు చేసినప్పటికీ మోసపోయే వాళ్ళు పోతూనే ఉన్నారు.. డిజిటల్ యాప్స్ ద్వారా అమాయకులను మోసం చేస్తున్న ఓ కేటుగాడి పన్నాగాన్ని పోలీసులు బయటపెట్టారు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..

ఎవరైనా ఏటీఎం కేంద్రాల వద్ద, పెట్రోల్ బంకుల వద్ద, హోటళ్ల వద్ద కనిపిస్తే చాలు అతడు వాలిపోతాడు..” సార్ మా అమ్మకు ఆరోగ్యం అసలు బాగోలేదు.. చావు బతుకుల మధ్య ఉంది. నాకు ఇప్పుడే సమాచారం తెలిసింది. నా మొబైల్ వాలెట్ లో డబ్బులు ఉన్నాయి. మీరు లిక్విడ్ ఇస్తారా. మీ నంబర్ కు యాప్ ద్వారా బదిలీ చేస్తాను” అంటాడు. ఆ మాటలు నిజమే అని నమ్మి.. ఎవరైనా డబ్బులు ఇస్తే ఇక అంతే సంగతులు.. ఆ తర్వాత నిలువునా మోసపోవడం వారి వంతవుతుంది. నకిలీ యాప్ ద్వారా వారి నెంబర్ కు డబ్బులు ట్రాన్స్ ఫర్ అయినట్టు సందేశాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.

హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సంతోష్ నగర్ ప్రాంతానికి చెందిన సందీప్ కుమార్ గతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేసేవాడు. సరిగా పనిచేయకపోవడం, జల్సాలకు అలవాటు పడటంతో యాజమాన్యం అతడిని తొలగించింది. ఆ తర్వాత మరో ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా చేరాడు. అక్కడ కూడా పనిచేయడం తక్కువ, జల్సాలు చేయడం ఎక్కువ అన్నట్టుగా ఉంది అతని వ్యవహార శైలి.. ఈ క్రమంలోనే తన జల్సాలకు డబ్బులు సరిపోకపోవడంతో, సరికొత్త మోసానికి తెర లేపాడు. ఇందులో భాగంగా గూగుల్ లో తీవ్రంగా సెర్చ్ చేసి నకిలీ యాప్ ద్వారా డబ్బులు పంపే విధానాన్ని బాగా ఒంట పట్టించుకున్నాడు. ఇలా ఏటీఎం కేంద్రాలు, రహదారుల పక్కన ఉన్న హోటళ్లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకొని తన మోసాన్ని అమలు చేసేవాడు. ఇప్పటివరకు చాలామంది వ్యక్తులను మోసం చేశాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ డబ్బులు బదిలీ చేస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మొద్దని.. సాధ్యమైనంతవరకు తెలిసిన వాళ్లతోనే డిజిటల్ లావాదేవీలు కొనసాగించాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిచిత వ్యక్తులకు బ్యాంకు వివరాలు.. ఇతర సమాచారం చెప్పొద్దని హితవు పలికారు.