https://oktelugu.com/

Cyber ​​Crime: ఇకపై సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని మోసం చేయలేరు.. కేంద్రం వేస్తున్న ప్లాన్లు ఇవే..

ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తర్వాత.. డిజిటల్ చెల్లింపులు ఎక్కువైన తర్వాత.. సామాజిక మాధ్యమాల వినియోగం అధికమైన తర్వాత.. సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు ఎన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఉపయోగం ఉండడం లేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 13, 2024 / 09:03 PM IST

    Cyber ​​Crime

    Follow us on

    Cyber ​​Crime: సైబర్ నేరగాళ్లు కంటికి కనిపించకుండా కోట్లను కొట్టేస్తున్నారు. “మాదక ద్రవ్యాలలో దొరికారని.. మీ పిల్లలను అపహరించామని.. మీ పేరుతో కొరియర్ వచ్చిందని”.. ఇలా రకరకాల పేర్లతో అమాయకులను మోసం చేస్తున్నారు. మోసపోతున్న వారిలో ఉన్నత విద్యావంతులే అధికంగా ఉండడం విశేషం. అయితే సైబర్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ రంగంలోకి దిగింది. ఈ మోసాలకు చెక్ పెట్టేందుకు సస్పెక్ట్ రిజిస్ట్రీని సిద్ధం చేసింది. రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ ఫిర్యాదుల ఆధారంగా మొత్తం 14 లక్షల మంది వివరాలతో దీనిని రూపొందించింది. ఈ రిజిస్ట్రీలో మోసపూరితమైన యాప్ లు, వెబ్ సైట్ లు, సంస్థలు, సైబర్ నేరగాళ్లు, వారు చేసిన నేరాల వంటి వివరాలు ఉన్నాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు వినియోగించుకునే విధంగా కేంద్రం ఈ సస్పెక్ట్ రిజిస్ట్రీ ఏర్పాటు చేసింది.

    తెలుగు రాష్ట్రాలలో సగటున సైబర్ నేరగాళ్లు కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2021 జూలై నుంచి 2024 జూలై వరకు ఏకంగా 940 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. అయితే ఇందులో 8.26 కోట్లు మాత్రమే పోలీసులు రికవరీ చేశారు. మరో 140 కోట్లను బ్యాంకుల్లో నిలుపుదల చేయించారు. వాస్తవానికి దొంగతనాలు, దోపిడీలకంటే ఇలా సైబర్ నేరగాళ్ల వల్లే ఎక్కువగా బాధితులు నగదు పోగొట్టుకుంటున్నారు. వివిధ రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటూ సైబర్ నెరగాళ్లు ఈ మోసాలకు తెగబడుతున్నారు. అయితే వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర హోంశాఖ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏర్పాటు చేసింది. దీనివల్ల సైబర్ నేరాలకు ముకుతాడు పడుతుందని కేంద్ర హోం శాఖ భావిస్తోంది.

    సైబర్ నేరాల నియంత్రణకు మరికొన్ని విధానాలను కూడా కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ లో భాగంగా సీఎఫ్ఎంసీ ని ఏర్పాటు చేసింది. బ్యాంకులు, రుణాలు ఇచ్చే సంస్థలు, బీమా సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజిలు, పేమెంట్ అగ్రిగేటర్లు, టెలికం సర్వీస్ ప్రొవైడర్లు, ఇతర రాష్ట్రాల పోలీసులు ఇందులో సభ్యులుగా ఉంటారు. ఆర్థికపరమైన నేరాలకు సంబంధించిన విషయాలను గుర్తించడం.. దాని వెనుక ఉన్న సమాచారాన్ని విశ్లేషించడం.. వాటిని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించడం.. క్షేత్రస్థాయిలో అమలు చేయడం ఇవి భాగం విధి.

    సైబర్ నేరాలకు సంబంధించి సమాచారాన్ని సమన్వయ్ ఫ్లాట్ ఫామ్ లో సైబర్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు? ఎవరు ఈ మోసాలకు పాల్పడుతున్నారు? వంటి అంశాల ఆధారంగా సమాచారం మ్యాపింగ్, విశ్లేషణ వంటివి సమన్వయ్ వేదిక ద్వారా కేంద్ర దర్యాప్తు సంస్థలు, రాష్ట్రాల పోలీసులు మార్పిడి చేసుకోవచ్చు.