Car Accident: రోడ్డు ప్రమాదం.. ఎన్నో కుటుంబాలను చిద్రం చేస్తుంది. అంతులేని విషాదాలను మిగిల్చుతుంది. రోడ్డు ప్రమాదం జరిగితే.. రెండు కుటుంబాలే కాదు.. వారిపై ఆధారపడ్డ ప్రతి ఒక్కరిపై ప్రభావం ఉంటుంది కూడా. రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవితాంతం క్షతగాత్రులుగా మిగిలిన వారు ఉన్నారు. అందుకే రోడ్డు ప్రమాదం అంటే ఎన్నో కుటుంబాలకు శాపం. అయితే ఓ కుటుంబం ప్రమాదం బారిన పడింది కానీ.. ఒక్క గాయం కూడా తగలకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. కానీ అక్కడ ప్రమాదం జరిగిన తీరు చూస్తే మాత్రం భయానకమే.
* నక్కపల్లి సమీపంలో..
విశాఖ కూర్మన్నపాలెం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం విజయవాడ కారుపై బయలుదేరింది. జాతీయ రహదారిపై సాఫీగా వెళుతోంది వారి కారు. కానీ ఒక్కసారిగా అదుపు తప్పింది. రోడ్డు బయటకు వెళ్లే క్రమంలో అక్కడున్న రెయిలింగ్, స్తంభం దిమ్మెను ఢీ కొట్టి.. తలకిందులుగా నిలిచిపోయింది. అందులో ఉన్నవారు అదృష్టవశాత్తు క్షేమంగా బయటపడ్డారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఒడ్డిమెట్ట సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది ఈ ప్రమాదం. కారులో నలుగురు ఉన్నారు. కుటుంబ యజమాని డ్రైవింగ్ చేస్తుండగా, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎవరికి ఏ ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
* విజయవాడ వెళుతుండగా..
ఎంతో ఆనందంగా వారు విజయవాడకు బయలుదేరారు. సరిగ్గా ఒడ్డిమెట్ట సమీపంలోకి రాగానే వాహనము అదుపు తప్పింది. రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ క్రమంలో ఇనుప రెయిలింగ్.. దాని పక్కనే ఉన్న స్థంభం దీన్లను ఢీకొట్టింది. ఇంజన్ భాగం రెయిలింగ్, స్తంభం దిమ్మె మధ్య బలంగా ఇరుక్కుపోయింది. కారు వెనుక భాగం అమాంతం పైకి లేచి అలానే ఉండిపోయింది. అయితే వాహనంలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో అందరూ క్షేమంగా బయటపడ్డారు. అయితే ఎదురుగా స్తంభం లేకుంటే మాత్రం కారు గడ్డలోకి దూసుకుపోయి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేది.