Alluri Sitarama Raju District: మహిళకు మాతృత్వం ఒక వరం. ప్రతి మహిళ మాతృత్వాన్ని కోరుకుంటుంది. పెళ్లయిన ప్రతి మహిళ అమ్మగా మారాలనుకుంటుంది. మాతృత్వాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటుంది. కానీ అనారోగ్య కారణాల రీత్యా సంతానం లేకపోతే ఆ మహిళలు పడే బాధ వర్ణనాతీతం. సమాజంలో వారిపై పడే నిందలు కూడా అలానే ఉంటాయి. అటువంటి పరిస్థితిని ఎదుర్కొంది ఓ మహిళ. వివాహం జరిగి ఏళ్లు గడుస్తున్న సంతానం లేకపోవడంతో అయినవారు, కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారి మాటలను భరించలేక పోయింది. ఏం చేయాలో తెలియక ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. దానిని నిజం చేసేందుకు ఆ మహిళ పడిన బాధ వర్ణనాతీతం. ఆమె తీసుకున్న నిర్ణయం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది.
* ఆ నింద భరించలేక
అల్లూరి సీతారామరాజు( Alluri Sitaram Raju) జిల్లాకు చెందిన మహిళకు పెళ్లయి చాలా రోజులు అవుతున్న సంతానం లేదు. దీంతో కుటుంబ సభ్యులు బాధతో ఉన్నారు. చాలామంది సూటి పోటి మాటలతో ఆమెను వేధించారు. అయితే జీర్ణించుకో లేకపోయినా ఆ మహిళ తనకు గర్భం వచ్చినట్లుగా కుటుంబ సభ్యులకు చెప్పింది. వారు కూడా నిజమేనని నమ్మారు. అప్పటినుంచి ఆమె భర్తతో కలిసి ప్రతినెలా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆసుపత్రి వద్దకు వచ్చేది. భర్తను కూడా నమ్మించింది. అయితే ఆమెకు ఎటువంటి గర్భం రాలేదు. కేవలం తనపై ఉన్న అపవాదును తొలగించుకునేందుకు ఈ ప్రయత్నం చేసింది. నెలల గడిచే కొద్ది నిండు గర్భిణీల కనిపించేందుకు చీరలోపల ఒత్తుగా కొన్ని దుస్తులను అమర్చింది. మార్చి 31న ఆసుపత్రికి వచ్చిన ఆ మహిళ గదిలోకి వెళ్ళింది. డాక్టర్ను కలిసి బయటకు వచ్చింది.
* పోలీసులు రంగంలోకి దిగడంతో..
అయితే తనకు ఏప్రిల్ 3న డెలివరీ డేట్( delivery date) ఇచ్చారని భర్తతో చెప్పి ఇంటికి వెళ్లి పోయింది. ఈ నెల మూడున ఉదయం 11 గంటలకు భర్తతో కలిసి ఆమె రాజమండ్రి ఆసుపత్రికి వచ్చింది. అయితే గర్భం లేకపోవడంతో తన బండారం బయటపడుతుందని భయపడింది. మళ్లీ కొత్త నాటకానికి తెరతీసింది. తన భర్తకు కనిపించకుండా ఆసుపత్రి బయటకు వచ్చి కనిపించకుండా పోయింది. అక్కడ నుంచి ఆటో ఎక్కి కాకినాడ వెళ్ళిపోయింది. తాను ప్రసవానికి భయపడి ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేసానని.. తనకు కవల పిల్లలు పుడితే వారిని ఎవరో తీసుకువెళ్లిపోయారని భర్తకు ఫోన్ చేసి నమ్మించే ప్రయత్నం చేసింది. భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసి పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు పరిశీలించగా ఆసుపత్రి నుంచి ఆమె ఆటోలో వెళ్లడాన్ని గుర్తించారు. కాకినాడలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకోవడంతో అసలు విషయం బయట పెట్టింది. కేవలం సమాజంలో సూటిపోటి మాటలకు, నిందలకు భయపడి అలా చేశానని కన్నీటి పర్యంతం అయింది. చివరకు పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేశారు.