Adilabad: ఏ తల్లయినా.. తన బిడ్డలను ప్రేమగా చూసుకుంటుంది. ఒక్క క్షణం కనపడకపోయినా తల్లడిల్లిపోతుంది. కనిపించేదాకా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోదు.. కానీ ఆ తల్లి తన కుమారుడిని చూసేందుకు మూడున్నర సంవత్సరాలుగా ఎదురుచూసింది. కొడుకు ఎక్కడ ఉన్నాడని భర్తను అడిగితే.. “బాగున్నాడు, రేపో, మాపో వస్తాడని” చెబుతున్నాడు. ఇలా అడిగిన ప్రతిసారీ భర్త ఇలానే చెబుతుండడంతో విసిగి వేసారి పోయిన ఆ ఇల్లాలు.. ఉన్న ఒక కొడుకుతో తన తల్లి గారింటికి వెళ్లిపోయింది. కానీ చివరికి ఆ తల్లి ఊహించని ఘోరం జరిగిపోయింది. ఆమె కల గనని దారుణం చోటుచేసుకుంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రెబ్బెన మండలం నంబాల గ్రామానికి చెందిన సుల్వ శ్రీనివాస్, మల్లీశ్వరి దంపతులకు రిషి (11), అఖిల్ అనే ఇద్దరు మగ పిల్లలున్నారు. ఇదే గ్రామానికి చెందిన భీమ్ రావ్ అనే నాటు వైద్యుడు పొసిగాం అనే గ్రామ శివారులో ఒక ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నాడు. భీమ్ రావ్ అంటే శ్రీనివాస్ కు భక్తి ఎక్కువ. శ్రీనివాస్ ఎదురు ఇంట్లోనే ఉండే భీమ్ రావ్ అతని భార్య మల్లీశ్వరిపై మనస్సుపడ్డాడు. పలుమార్లు ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని శ్రీనివాస్ తో చెప్పినప్పటికీ అతడు పట్టించుకోలేదు. పైగా మల్లీశ్వరిని తిట్టాడు. ఇలా జరుగుతుండగానే ఒకరోజు రిషికి కాళ్లల్లో తిమ్మిర్ల సమస్య వచ్చింది. దీంతో శ్రీనివాస్ ఈ విషయాన్ని భీమ్ రావ్ కు చెప్పాడు. ఇదే అదునుగా భీమ్ రావ్ రిషిని తన ఆశ్రమంలో చేర్పించాలని సూచించాడు.
ఆశ్రమంలో రిషి చేరితే అతడిని చూసేందుకు మల్లీశ్వరి వస్తుందని.. ఆమెను తన వశం చేసుకోవచ్చని భీమ్ రావ్ ప్రణాళిక. ఇందులో భాగంగానే రిషి ని తన ఆశ్రమంలో చేర్పించాలని.. కొద్దిరోజులపాటు చికిత్స చేస్తానని భీమ్ రావ్ చెప్పడంతో శ్రీనివాస్ నమ్మాడు. ఈ క్రమంలోనే 2020 నవంబర్లో రిషిని శ్రీనివాస్ భీమ్ రావ్ ఆశ్రమంలో చేర్పించాడు. ఈ క్రమంలో కొడుకును చూసేందుకు మల్లీశ్వరి రెండుసార్లు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడికి మల్లీశ్వరి వెళ్ళినప్పుడు తనను కొడుతున్నాడని భీమ్ రావ్ పై రిషి ఫిర్యాదు చేశాడు. తన తల్లి మీద పడి ఏడ్చాడు. ఈ క్రమంలోనే శ్రీనివాస్ కు, మల్లీశ్వరి కి గొడవలు జరిగాయి. భర్త తీరు మార్చుకోకపోవడంతో విసిగి వేసారి పోయిన మల్లీశ్వరి.. చిన్న కుమారుడిని తీసుకొని స్వగ్రామానికి వెళ్ళింది.
భీమ్ రావ్ చేసిన వైద్యం వల్ల రిషి 2021లో కన్నుమూశాడు. ఈ విషయం బయటికి చెప్తే ఆశ్రమానికి చెడ్డ పేరు వస్తుందని.. మృతదేహాన్ని ఆశ్రమం వెనుక పూడ్చి పెడదామని భీమ్ రావ్ చెప్తే.. దానికి శ్రీనివాస్ అంగీకరించాడు. రిషి చనిపోయిన మరసటి రోజు శ్రీనివాస్ , భీమ్ రావ్ అతడి మృతదేహాన్ని ఆశ్రమం వెనుక పూడ్చిపెట్టారు.. అయితే రిషి చనిపోయిన విషయం శ్రీనివాస్ మల్లీశ్వరి కి చెప్పలేదు. ఆమె తన కుమారుడి గురించి అడిగినప్పుడల్లా “బాగున్నాడు” అంటూ శ్రీనివాస్ దాటవేస్తూ వస్తున్నాడు. మల్లీశ్వరి ఒత్తిడి తేవడంతో “రిషి ఆశ్రమంలో కోలుకున్నాడని.. అతడిని హాస్టల్లో చేర్పించానని” బుకాయించాడు. రిషి తో మాట్లాడాలని ఉందని, మాట్లాడించాలని మల్లీశ్వరి పలుమార్లు అడిగినా శ్రీనివాస్ దాటవేస్తూ వచ్చాడు. మూడున్నర సంవత్సరాలుగా ఇదే తీరు కొనసాగించడంతో.. గత్యంతరం లేక మల్లీశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు రంగంలోకి దిగడంతో అసలు విషయం వెలుగు చూసింది. భీమ్ రావ్, శ్రీనివాస్ ను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, వాస్తవం వెలుగులోకి వచ్చింది. వారిద్దరిని ఆశ్రమం వద్దకు తీసుకెళ్లగా.. ఆ బాలుడిని పాతిపెట్టిన స్థలం చూపించారు. అధికారుల సమక్షంలో తవ్వకాలు జరపగా రిషి మృతదేహం తాలూకూ ఎముకలు బయటపడ్డాయి. వైద్యులు పరీక్షల నిమిత్తం అస్థికలను ప్రయోగశాలకు పంపించారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Adilabad district atrocious incident
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com