Raghu Babu: సినీ నటుడు రఘుబాబు ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడు.. కారుతో ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు.. నల్లగొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీ చెందిన సంధినేని జనార్దన్ రావు (48) భారత రాష్ట్ర సమితి పట్టణ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈయనకు లెప్రసీ కాలనీలో వ్యవసాయ క్షేత్రం ఉంది. ఈ వ్యవసాయ క్షేత్రానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ వెళ్తుంటారు. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం వాకింగ్ కోసం తన ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పానగల్ బైపాస్ రోడ్డు మీదుగా తన ద్విచక్ర వాహనాన్ని వ్యవసాయ క్షేత్రానికి యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో అనుకోని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనార్దన్ రావు అక్కడికక్కడే మృతి చెందారు.
జనార్దన్ రావు యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలో హైదరాబాద్ నుంచి గుంటూరుకు స్వయంగా కారు నడుపుకుంటూ ప్రముఖ సినీ నటుడు రఘుబాబు వెళ్తున్నారు. వెనకనుంచి జనార్దన్ రావు ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టారు. అతను ఢీకొట్టిన వేగానికి జనార్దన్ రావు అంతెత్తున ఎగిరి డివైడర్ మీద పడ్డారు. తల, చాతి భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగి, తలభాగంలో తీవ్రంగా గాయాలై అతను అక్కడికక్కడే మృతిచెందాడు. జనార్దన్ రావుకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. జనార్దన్ రావు భార్య నాగమణి ఫిర్యాదు నేపథ్యంలో రఘుబాబును పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం రఘుబాబు వాహనాన్ని నిర్ణీత పరిమితికి మించి వేగంగా తోలుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. జనార్దన్ రావు భారత రాష్ట్ర సమితి నల్లగొండ పట్టణ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించారు. త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహక సభల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా ఆయన పార్టీ అభివృద్ధికి కృషి చేశారు.. ఆయన మృతి పట్ల భారత రాష్ట్ర సమితి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.