Ananthapuram Crime News: ఆవులు పరస్పరం పోట్లాడుకుంటే మధ్యలో లేగల కాళ్లు విరిగినట్టు.. పెద్దల వ్యవహారం ఓ బాలుడి ప్రాణాన్ని తీసింది. ఈ సంఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి అనంతపురం జిల్లాలో కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 13 సంవత్సరాల బాలుడు హత్యకు గురయ్యాడు.. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హిందూపురంలో సరస్వతీ విద్యా మందిరం అనే పాఠశాలలో వీరేష్ 13 సంవత్సరాల బాలుడు చదువుతున్నాడు. ఇతడిది ఉమ్మడి అనంతపురం జిల్లా అగలి మండలం నందరాజన పల్లి గ్రామం. వీరేష్ తల్లిదండ్రుల పేరు ఈరన్న, లక్ష్మమ్మ. వీరేష్ కు ఒక సోదరి ఉంది. ఆమె పేరు ఇంచన. వీరేష్ కుటుంబ సభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని గౌడనహట్టి అనే ప్రాంతంలో నివసిస్తున్నారు.
ఈరన్న గొర్రెలు మేపుకుంటూ జీవనం సాగిస్తాడు. గొర్రెలను మేత కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటాడు. నందరాజన పల్లి గ్రామంలో వీరేష్ కు వరుసకు మేనమామ అయ్యే దొడ్డయ్య కుటుంబం నివసిస్తోంది. దొడ్డయ్య తనకు ఇంచన ను ఇచ్చి పెళ్లి చేయాలని కొంతకాలంగా ఈరన్న మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఆ అమ్మాయి చదువుకుంటున్నదని, పైగా మైనారిటీ కూడా తీరలేదని చెప్పడంతో దొడ్డయ్య అనేక సందర్భాలలో ఈరన్న కుటుంబంతో గొడవపడ్డాడు. సరిగా 25 రోజుల క్రితం వీరేష్ గౌడనహట్టి ప్రాంతంలో జాతర ఉండడంతో అక్కడికి వెళ్ళాడు.
ఈనెల 1న దొడ్డయ్య పట్టరాని ఆగ్రహంతో వీరేష్ ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో జాతర జరుగుతున్న క్రమంలో ఈరన్న, లక్ష్మమ్మ, ఇంచన గుడికి వెళ్లారు. వీరేష్ మాత్రమే ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఒకడే ఉన్నాడని భావించిన దొడ్డయ్య.. వీరేష్ మీద ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాడు. తనకు ఇంచన ను ఇచ్చి పెళ్లి చేయడం లేదని కోపాన్ని పెంచుకున్నాడు. దొడ్డయ్య బలంగా కొట్టడంతో వీరేష్ కేకలు పెట్టాడు. చుట్టుపక్కల వారు గమనించి ఇంటికి రావడంతో దొడ్డయ్య అక్కడి నుంచి పారిపోయాడు. వారంతా ఇంట్లోకి వెళ్లి చూడగా వీరేష్ తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతడిని ఓ ప్రైవేట్ వాహనంలో బెంగళూరు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించారు. ఆ తర్వాత తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స నిర్వహిస్తుండగా బుధవారం రాత్రి కన్నుమూశాడు. ఈ నేపథ్యంలో వీరేష్ తల్లిదండ్రులు ఆర్సికెర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు దొడ్డయ్యను అరెస్ట్ చేశారు. మధుగిరి సబ్ జైలుకు తరలించారు.