Jagtial: బలగం సినిమా చూసారా.. అందులో మూలుగ బొక్క కోసం పెద్ద గొడవే జరుగుతుంది. మూలుగ బొక్క కోసం కుటుంబాలు విడిపోతాయి. చివరికి ఆ ఇంటి పెద్ద చనిపోయిన తర్వాత.. అంత్యక్రియల విషయంలో మళ్ళీ ఆ గొడవ ప్రస్తావనకు వస్తుంది. చివరికి ఆ గొడవ సుఖాంతం అవుతుంది. మూలుగ బొక్క కోసం గొడవలు ఏంటి.. కుటుంబాలు విడిపోవడమేంటి.. కొంతమందికి విచిత్రంగా ఉండవచ్చు గాని.. వాస్తవానికి మటన్ కోసం, చికెన్ కోసం తెలుగు రాష్ట్రాలలోని కాదు మనదేశంలో పలు ప్రాంతాలలో గొడవలు జరిగాయి. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోయాయి. తెలంగాణ రాష్ట్రంలో దసరా సందర్భంగా మటన్ కూర విషయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఓ యువతి ప్రాణాలు తీసింది.
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామంలో అల్లపు గంగోత్రి (22) యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన స్థానికంగా విషాదం నింపింది. ఈ ఘటన కు సంబంధించి పోలీసులు విచారణ జరపగా దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ గ్రామానికి చెందిన సంతోష్, గంగోత్రి గత ఆరు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు.. వీరిద్దరూ పెద్దలను ఒప్పించి గత నెల 26న వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే దసరా సందర్భంగా అత్తగారింటికి సంతోష్ వెళ్ళాడు. భర్త వచ్చినా ఆనందంలో గంగోత్రి స్వయంగా మటన్ కూర వండింది. అయితే అందులో కారం కాస్త ఎక్కువగా వేసింది. కారం ఎక్కువైందని ఓర్చుకోలేని సంతోష్.. ఆమెపై గొడవకు దిగాడు. గంగోత్రి తల్లిదండ్రులు వారిస్తున్నప్పటికీ అతడు తన ఆగ్రహాన్ని చల్లార్చుకోలేదు.
భర్త ప్రవర్తనతో గంగోత్రి తీవ్రంగా కలత చెందింది. ఇక అదే రోజు రాత్రి సంతోష్ తన భార్యను సొంత ఇంటికి తీసుకెళ్లాడు. ఆరోజు కూడా వారిద్దరు గొడవకు దిగారు. ఇద్దరి మధ్య మాటలు పెరిగిపోయాయి. దీంతో గంగోత్రి తీవ్ర మనస్థాపానికి గురైంది. దీంతో బలవన్మరణానికి పాల్పడింది. గంగోత్రి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని సంతోష్ ఆమె కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు..
శుక్రవారం తన భార్యను ఇంటికి తీసుకెళ్లిన సంతోష్.. మళ్లీ గొడవను మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. అంతేకాదు గంగోత్రిని నానా మాటలు అన్నట్టు ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. ఒకానొక దశలో ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. దీంతో సంతోష్ కుటుంబ సభ్యులు అతడిని వారించారు. ఇన్నాళ్లపాటు ప్రేమించిన భర్త ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని తట్టుకోలేని గంగోత్రి ఆత్మహత్య చేసుకుంది..