
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మాస్క్ ల వినియోగం సైతం పెరుగుతోంది. అయితే వినియోగించే మాస్క్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ మాస్క్ పడితే ఆ మాస్క్ ను వినియోగించినా కరోనా వైరస్ సోకే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది.
కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి ఎన్ 95 మాస్క్ ఉత్తమమని చెప్పవచ్చు. ఈ మాస్క్ ఏకంగా 95 శాతం వరకు వైరస్ ను అడ్డుకుంటుంది. సర్జికల్ మాస్క్ ను వాడితే ఆ మాస్క్ కూడా 95 శాతం వైరస్ ను నియంత్రిస్తుంది. అయితే దేశంలో చాలామంది క్లాత్ మాస్క్ లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మాస్క్ వైరస్ ను ఏ మాత్రం అడ్డుకోలేదని కేంద్రం చెబుతుండటం గమనార్హం. ఎన్-99, డబ్ల్యూ-95, ఎఫ్ఎఫ్ పీ-1 మాస్కులు సైతం కరోనా వైరస్ కు సులువుగా చెక్ పెడతాయి.
ఈ మాస్కులు 95 శాతం నుంచి 99 శాతం వరకు వైరస్ ను సులభంగా నియంత్రిస్తాయి. స్పాంజ్ మాస్క్ వాడటం వల్ల మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఈ మాస్క్ వైరస్ ను ఏ మాత్రం అడ్డుకోలేదు. యాక్టివేటెడ్ కార్బన్ మాస్క్ ను ఉపయోగించినా ఎలాంటి ఫలితం ఉండదు. అందువల్ల ఈ మాస్క్ లకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. సెకండ్ వేవ్ లో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో మాస్క్ ను వినియోగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తక్కువ మొత్తం ఖర్చు చేసి మాస్క్ లను కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. కేంద్ర ప్రభుత్వం సూచనలను అనుసరించి మాస్క్ ల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.