
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లతో పోలిస్తే థర్డ్ వేవ్ ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తుండటం గమనార్హం. కరోనా థర్డ్ వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపే అవకాశాలు అయితే ఉన్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో పుణెలోని బీజే మెడికల్ కాలేజీ పరిశోధకులు ఒక శుభవార్త చెప్పారు. తట్టు వ్యాక్సిన్ తీసుకున్న పిల్లలకు కరోనా నుంచి రక్షణ కలుగుతుందని వెల్లడించారు.
శాస్త్రవేత్తలు తట్టు వ్యాక్సిన్ పై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించడం గమనార్హం. కరోనా వైరస్‌పై మీజిల్స్ వ్యాక్సిన్ 87.5 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. అందువల్లే ఈ వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకు కరోనా సోకే అవకాశాలు సైతం తక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. హ్యూమన్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునోథెరప్యూటిక్స్ జర్నల్ లో ఇందుకు సంబంచించిన కథనం ప్రచురింపబడింది.
కరోనా నుంచి మీజిల్స్ వ్యాక్సిన్ దీర్ఘకాల రక్షణ కూడా అందిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం. అయితే మీజిల్స్ వ్యాక్సిన్ పై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డాక్టర్ నీలేశ్ గుజార్ ఇలాంటి అధ్యయనం జరగడం ప్రపంచంలోనే తొలిసారని వెల్లడించారు. మీజిల్స్ డోసు తీసుకోని వారు వెంటనే తీసుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా 17 ఏళ్ల వయసున్న 548 మందిని రెండు గ్రూపులుగా విభజించి సంవత్సరం పాటు శాస్త్రవేత్తలు పరిశోధనలను నిర్వహించారు. మీజిల్స్, బీసీజీ వ్యాక్సిన్లు కరోనా నుంచి పిల్లలకు రక్షణ కల్పిస్తున్నట్టు శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.