Omicron Variant: చైనాలో పుట్టిన మాయదారి కరోనా వైరస్ తన రూపు మార్చుకుంటూ మరింత శక్తివంతమవుతోంది. బలోపేతమై దేశాలకు దేశాలకు విశృంఖలంగా వ్యాపించి వేలమందికి సోకుతోంది. ప్రాణాలు తీస్తోంది. సెకండ్ వేవ్ లో భారత్ లో వెలుగుచూసిన ప్రమాదకర వేరియంట్ మిగిల్చిన విషాదాన్ని ఇప్పటికీ మనం మరవలేదు. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ‘ఒమిక్రాన్’ కరోనా వేరియంట్ అంతకుమించిన శక్తివంతంగా తయారై ప్రపంచాన్ని భయపెడుతోంది.
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ‘ఒమిక్రాన్’ వైరస్ ఇప్పటికే 30కిపైగా దేశాలకు విస్తరించి ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. భారత్ లో మరణమృదంగం వినిపించిన డెల్టా రకంతో పోలిస్తే ‘ఒమిక్రాన్’ వ్యాప్తి, రీ ఇన్ఫెక్షన్ విషయంలో అనేక రెట్లు వేగవంతమైనదని తేలడం భారత ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
ఇక ‘ఒమిక్రాన్’ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందంటే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి సైతం ఈ వైరస్ సోకుతుండడంతో దీన్ని కట్టడం చేయడం అందరికీ పెద్ద సవాల్ అని చెప్పక తప్పదు. ఈ క్రమంలోనే దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించాల్సి వస్తుందా? బూస్టర్ డోస్ పంపిణీ చేస్తారా? తదితర అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు షాకింగ్ న్యూస్.. ఆ ముప్పు ఎక్కువట!
వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతం చేస్తే ఇలాంటి ప్రమాదకర వేరియంట్ ప్రభావం నుంచి తప్పించుకోగలమని.. లేదంటే థర్డ్ వేవ్ తప్పదని కేంద్రప్రభుత్వం చెబుతోంది. దక్షిణాఫ్రికాలో చిన్నారులకు ఈ వైరస్ వేగంగా సోకడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. దీంతో చిన్నపిల్లలకు టీకాలు వేయాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది.
టీకాలు వేయడం, మాస్కులు ధరించడం.. భౌతిక దూరం పాటిస్తే మళ్లీ లాక్ డౌన్ తప్పుతుందని.. జనాలు నిర్లక్ష్యం చేస్తే మాత్రం మరోసారి లాక్ డౌన్ విధించాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు నిబంధనలు పాటిస్తేనే మనుగడ సాధ్యమని చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి వారు బాధ్యతతో కనుక వ్యవహరిస్తే మళ్లీ లాక్ డౌన్ రాదని సూచిస్తున్నారు. లేకపోతే జనవరి వరకూ ఈ ‘ఒమిక్రాన్’ విస్తరణ లాక్ డౌన్ కు దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.
Also Read: ప్రజలను వణికిస్తున్న కరోనా కొత్త వేరియంట్.. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు షాక్!