
కరోనా మహమ్మారి విజృంభణ వల్ల అష్టకష్టాలు పడుతున్న భారత ప్రజలకు ఈ వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. సరిగ్గా మరో 73 రోజుల్లో భారతదేశ ప్రజలకు కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ‘కోవిషీల్డ్’ పేరుతో అక్టోబర్ నెల చివరినాటికి వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొస్తామని ‘‘సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా’’ ప్రతినిధులు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాక్సిన్ ను నేషనల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాం కింద ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయనుంది.
సీరం సంస్థ ప్రతినిధులు ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్రం వ్యాక్సిన్ విషయంలో తమ కంపెనీకి లైసెన్స్ ను ఇచ్చిందని… మరో 58 రోజుల్లో క్లినికల్ ట్రయల్ పూర్తవుతాయని సీరం సంస్థ ప్రతినిధులు తెలిపారు. తొలి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలను సాధించామని… మూడో దశ ట్రయల్ లో ఇవ్వాల్సిన మొదటి మోతాదును శనివారం రోజున ఇచ్చామని తెలిపారు.
29 రోజుల తర్వాత రెండో డోస్ ఇవ్వనున్నామని… రెండో డోస్ ఇచ్చిన 15 రోజుల తర్వాత వ్యాక్సిన్ కు సంబంధించిన పూర్తి ఫలితాలు వెల్లడవుతాయని సీరం సంస్థ ప్రతినిధులు చెప్పారు. 17 కేంద్రాల్లో… ప్రతి కేంద్రంలో దాదాపు 100 మందిపై ఈ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సీరం సంస్థ నుంచి వ్యాక్సిన్ ను కొనుగోలు చేస్తామని సంకేతాలు ఇచ్చినటు తెలుస్తోంది. 2022 సంవత్సరం జనవరి నాటికి సీరం సంస్థ నుంచి 68 కోట్ల కరోనా వ్యాక్సిన్లను కేంద్రం కొనుగోలు చేయనుందని తెలుస్తోంది..