
మనలో చాలామంది కరోనా వైరస్ సోకిందని తెలియగానే వైరాగ్యంతో, బాధతో కనిపిస్తూ ఉంటారు. కరోనా వైరస్ కంటే ఆ వైరస్ కు సంబంధించిన భయమే ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. దీంతో వైద్య సిబ్బంది పలు ప్రాంతాల్లో రోగుల్లో మానసిక స్థైర్యాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నారు. వైద్య సిబ్బంది పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తున్న వీడియోలు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
తాజాగా విశాఖ జిల్లాలోని వైద్య సిబ్బంది కరోనా సోకిన రోగుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు. పాడేరులోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో చాలా రోజుల క్రితమే అధికారులు కరోనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో తాజాగా వైద్య సిబ్బంది రోగులను అలరించేందుకు రోగులలో ఆనందాన్ని పెంచే పాటలకు ఆడిపాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైద్య సిబ్బంది డ్యాన్సుల ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
పాడేరు వైద్య సిబ్బంది మీడియాతో మాట్లాడుతూ వైరస్ సోకిన వాళ్లలో ఉత్సాహాన్ని నింపడం ద్వారా వాళ్లు త్వరగా కోలుకునేలా చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వైరస్ శరవేగంగా వ్యాప్తిచెందుతోందని… మారుతున్న పరిస్థితుల ప్రకారం కరోనా వైరస్ సోకడం సహజంగా మారిందని చెప్పారు. ఎవరికైనా కరోనా సోకితే మనో ధైర్యంతో వైరస్ ను జయించవచ్చని…. మానసిక ఆందోళన చెందడం వల్ల ప్రయోజనం శూన్యమని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పాడేరు ఏజెన్సీలో కరోనా కేసుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.