KCR Declares New Pensions: కెసిఆర్ కు, బిజెపికి ఇప్పుడు ఏమాత్రం పొసగడం లేదు. గతంలో అరకొరగా విలేకరుల సమావేశాలు నిర్వహించే కెసిఆర్.. ఇప్పుడు 10 – 15 రోజులకొక ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది కూడా కేవలం బిజెపిని తిట్టేందుకు మాత్రమే. గతంలో కెసిఆర్ ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే ఎంతో కొంత విషయం ఉండేది. కానీ ఈమధ్య నిర్వహించిన ప్రెస్ మీట్ లలో చెప్పిందే చెబుతున్నారు. పైగా సంబంధం లేని విషయాలు మాట్లాడి విలేకరుల సమయం వృధా చేస్తున్నారు. గతంలో ఏమాత్రం విలేకరులను పట్టించుకోని కేసీఆర్.. ఈమధ్య గౌరవించడం ప్రారంభించారు. ముఖ్యంగా ది హిందూ విలేఖరి రాహుల్ ప్రస్తావన లేకుండా అసలు విలేకరుల సమావేశమే ప్రారంభించడం లేదు. తాజాగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో నీతి ఆయోగ్ ను కెసిఆర్ తూర్పారబట్టారు. అది ఒక నిరర్థక సంస్థ అని తేల్చిపారేశారు. అంతే కాకుండా నీతి ఆయోగ్ సమావేశాన్ని తాము బహిష్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. మరో వైపు తెలంగాణలో 10 లక్షల మందికి కొత్తగా పింఛన్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు శాసనసభ స్థానం ఖాళీగా ఉండగా దానిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయని కేసీఆర్.. కొత్త పింఛన్లు మంజూరు చేస్తూ ముందస్తు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ముందస్తులో భాగమేనా?
2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 2018 లోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండటంతో ముందస్తు ఎన్నికలకు ఆమోదం లభించింది. ఆసారి ఏకంగా గతంలో గెలిచిన కంటే ఎక్కువ సీట్లను టిఆర్ఎస్ గెలుచుకుంది. పైగా ఒకటి రెండు మినహా అన్నిచోట్ల సిట్టింగ్‌లకే సీట్లు కేటాయించి తెలంగాణ రాజకీయాల్లో చరిత్ర సృష్టించింది. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత టిఆర్ఎస్కు పాలన నల్లేరు మీద నడక కాలేదు. అప్పటిదాకా బిజెపితో ఉన్న సఖ్యత చెడింది. పైగా 2019 పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి నాలుగు స్థానాల్లో విజయబావుట ఎగురవేసింది. ఇక అప్పటినుంచి టిఆర్ఎస్ కు, బిజెపికి మధ్య ఆగాధం అంతకంతకు పెరుగుతూ పోయింది. ఆ తర్వాత జరిగిన దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బిజెపి తన సత్తా చాటింది. దీంతో టిఆర్ఎస్ తన ప్రధమ శత్రువుగా బిజెపిని భావించి ఎదురుదాడి ప్రారంభించింది. అప్పటినుంచి ఇప్పటిదాకా రెండు పార్టీల మధ్య ఉప్పు నిప్పు పోరు సాగుతోంది.
Also Read: Ambani- Ratan Tata Daily Income: రతన్ టాటా, ముఖేష్ అంబానీ రోజువారీ ఆదాయం ఎంతో తెలుసా?
నీతి అయోగ్ ను నాడు పొగిడి
వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ప్లానింగ్ కమిషన్ రద్దుచేసి నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా భాగస్వాములను చేసింది. నాడు నీతి ఆయోగ్ ను ప్రవేశపెట్టినపుడు మోడీ ప్రభుత్వాన్ని కెసిఆర్ పొగిడారు. నీతి ఆయోగ్ టీం ఇండియా మాదిరి పనిచేస్తుందని ప్రశంసించారు. గతంలో ప్లానింగ్ ఇండియా కమిషన్ మాదిరి కాకుండా నీతి ఆయోగ్ సభ్యులను దేశం మొత్తం పర్యటించి సర్వతోముఖాభివృద్ధికి చేపట్టవలసిన చర్యలు సూచించాలని మోడీ ప్రభుత్వం ఆదేశించింది. అందులో భాగంగానే ఆ సంస్థ సభ్యులు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా తెలంగాణకు నీతి ఆయోగ్ జలజీవన్ మిషన్‌లో భాగంగా 3,982 కోట్లు మంజూరు చేయగా ఇందులో తెలంగాణ ప్రభుత్వం 200 కోట్లు మాత్రమే తీసుకుంది. పీఎం కిసాన్ యోజన, ఇతరత్రా పథకాల కింద ₹1,195 కోట్లు తెలంగాణకు కేటాయించింది. ఇటీవల ధర్మశాలలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు.. గతంలో నీతి ఆయోగ్ సభ్యులు సీఎం కేసీఆర్ నేతృత్వంలో సమావేశాలు నిర్వహించారు. కానీ వాస్తవాలను వక్రీకరించి కేసీఆర్ కేవలం రాజకీయాలే లక్ష్యంగా తమపై విమర్శలు చేస్తున్నారని నీతి ఆయోగ్ ఆరోపించింది.
ముందస్తుకు సంకేతాలు ఇస్తున్నారా
కెసిఆర్ ఏం చేసినా రాజకీయమే ఉంటుంది. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఇదే స్థాయిలో ఆయన తీవ్ర విమర్శలు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ప్రజా వ్యతిరేకత ప్రబలుతుందనే ఇంటలిజెన్స్ సమాచారంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా బిజెపి ప్రభుత్వం కేసీఆర్ ను ఇబ్బందులు పెడుతుండడంతో ఆయన టార్గెట్ కమలనాధుల వైపు మళ్ళించారు. ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి వెళ్తున్న సంకేతాలు ఇస్తున్నారు. అందులో భాగంగానే ప్రధానమంత్రి మోదిని టార్గెట్ చేస్తున్నారు. ముందు ఇంట గెలిచి, రచ్చ గెలవాలని సామెత తీరుగా.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఆ తర్వాత దేశ రాజకీయాల్లో కాలు మోపాలని కేసీఆర్ అనుకుంటున్నారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది.. పైగా ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలు విమర్శల పాలవుతున్నాయి. యాదాద్రి అభివృద్ధి, కాలేశ్వరం ప్రాజెక్టు పనుల్లో జరిగిన డొలతనం మొన్నటి వర్షాలకు బయటపడింది. వీటిని కప్పి పుచ్చుకునేందుకు క్లౌడ్ బరస్ట్ అంటూ విమర్శలు చేసినా అవి ప్రజల్లోకి అంత సులువుగా వెళ్లలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఎంతగా బద్నాం చేయాలని చూస్తున్నా ఆ పాచిక పారే పరిస్థితులు కనిపించడం లేదు. పైగా కేసీఆర్ కంటే ఎక్కువ స్థాయిలో ప్రధాన మోడీపై విరుచుకుపడ్డ మమతా బెనర్జీ ఈడి దాడులతో పూర్తిగా సైలెంట్ అయ్యారు. అయితే ఈ పరిణామం తోనే మోదీని మరింత లక్ష్యంగా చేసుకొని కెసిఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి జాతీయస్థాయి మీడియా కూడా మంచి కవరేజ్ ఇస్తుండడంతో మోదీని ఎదిరించే నాయకుడిని నేనేనని కెసిఆర్ సంకేతాలు ఇస్తున్నారు.. అయితే తెలంగాణ రాజకీయం వేరు. ఢిల్లీలో రాజకీయం వేరు. మరోవైపు గతంలో కాంగ్రెస్ అంటే విరుచుకుపడే కేసీఆర్.. నా మధ్య రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు.
సోనియా గాంధీ ని ఈడి అధికారులు విచారణ చేస్తున్న క్రమంలో ఆమెకు మద్దతు తెలిపారు. నీతి ఆయోగ్ ను వేనోళ్ళ పొగిడిన కేసీఆర్… ఇప్పుడు మాట మార్చి ఎప్పుడో నెహ్రూ హయాంలో రూపొందించిన ప్లానింగ్ కమిషన్ గొప్పదని కితాబిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ప్రవేశపెట్టేం దుకు కొత్త పథకం అంటూ లేదు. ఉన్న వాటికే డబ్బులు సర్దుబాటు చేయడం కనా కష్టం అవుతున్నది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే ప్రభుత్వానికి పెద్ద ప్రహసనంగా మారుతున్నది. ఈ తరుణంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడమే మంచిదని నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆసరా పింఛన్లకు మోక్షం కలిగించారు.. ఏకంగా 10 లక్షల కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న సర్కారు ఈ పింఛన్లకు డబ్బులు ఎలా సర్దుబాటు చేస్తుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also Read:Pawan Kalyan- Chandrababu Meets Modi: మోదీ, బాబు కలయిక.. : పవన్ అదే కోరుకున్నాడా..?
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Cm kcr declares new pension for 10 lakh people because of early elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com