
తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నటుడు నాగయ్య ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ‘వేదం’ సినిమాలో ఆయన అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. దీంతో.. అప్పటి నుంచి అందరూ ఆయనను ‘వేదం’నాగయ్యగా పిలుస్తున్నారు. వేదం సినిమా తర్వాత ఆయనకు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వచ్చాయి. ఇప్పటి వరకూ సుమారు 30 చిత్రాల్లో ఆయన నటించారు.
ఏపీలోని గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపంలోని దేసవరం ఆయన స్వగ్రామం. ఎప్పుడో ఇండస్ట్రీకి వచ్చిన ఆయనకు మొదట్లో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆయన మొదటగా నటించింది వేదం సినిమాలోనే కావడం గమనార్హం. మొదటి చిత్రంతోనే గుర్తింపు దక్కడంతో ఆ తర్వాత పలువురు అవకాశాలిచ్చారు. ఆ విధంగా.. లీడర్, నాగవల్లి, రామయ్యా వస్తావయ్యా, స్పైడర్, సీమ టపాకాయ్ వంటి చిత్రాల్లో ఆయన నటించారు.
అయితే.. ఒకటీ రెండు నిమిషాల పాత్రలు కూడా ఎప్పుడో ఒకటీ అరా రావడంతో జీవనం దుర్భరంగా మారింది. పూటగడవడం కూడా కష్టంగా మారింది. ఈ మధ్యే నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో.. ఆయన మరింత డీలా పడిపోయారు. మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు.
ఈ పరిస్థితుల్లోనే శనివారం తెల్లవారుజామున వేదం నాగయ్య ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతిపట్ల ఇండస్ట్రీలోని పలువురు సంతాపం తెలుపుతున్నారు. ఇవాళ సాయత్రం లేదా రేపు ఉదయం అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.