టాలీవుడ్లో పవర్ స్టార్ దండయాత్ర కొనసాగుతోంది. వకీల్ సాబ్ దండెత్తిన తీరుకు రికార్డుల విధ్వంసం కొనసాగుతోంది..! నెవ్వర్ బిఫోర్ రికార్డులు నమోదు కొనసాగుతోంది. పవర్ స్టార్ అభిమానులు ఎంతటి ఆకలితో ఉన్నారో.. ఈ నంబర్స్ చూస్తేనే అర్థమవుతోంది. నిన్న (మార్చి 29) విడుదలైన ఈ సినిమా ట్రైలర్ దూసుకెళ్తున్న తీరు చూస్తూ ప్రతీ ఒక్కరు ఆశ్చర్యచకితులవుతున్నారు.
మూడు సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ సినిమా రాబోతోంది. దీంతో.. ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ఫ్యాన్స్ కళ్లలో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నారు. అయితే.. ఆ చూపుల గాఢత ఎంతనేది మాత్రం ఎవ్వరూ కొలవలేకపోయారు. తాజాగా విడుదలైన ట్రైలర్ దాన్నిచూపించింది. దాని రేంజ్ కు ఇండస్ట్రీ రికార్డులు చెల్లా చెదురైపోతున్నాయి.
వకీల్ సాబ్ ట్రైలర్ విడుదల చేయబోతున్నామని మేకర్స్ ప్రకటించిన నాటి నుంచే.. ఎదురు చూపులు మొదలు పెట్టారు ఫ్యాన్స్. దీంతో.. సోషల్ మీడియాలో వేడుకలు మొదలు పెట్టిన ఫ్యాన్స్.. 29వ తేదీ ఉదయం నుంచే ట్విట్టర్ లో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. #VakeelSaabTrailerDay అంటూ ట్వీట్లు, రీ-ట్వీట్లతో రచ్చ చేశారు.
సాయంత్రం 6 గంటలకు టీజర్ గాల్లో ఎగరనుందని ప్రకటించడంతో.. దాన్ని క్యాచ్ చేసేందుకు ముందు నుంచే సిద్ధమైపోయారు. టీజర్ యూట్యూబ్ లో విడుదలైందో లేదో.. వేలు, లక్షలు అంటూ పరుగులు పెట్టింది వ్యూయర్ షిప్. అది ఎంతలా అంటే.. ఇప్పటి వరకూ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ట్రైలర్ వ్యూస్ తో బాహుబలి-2 నమోదు చేసిన రికార్డును.. కేవలం నాలుగు గంటల్లో బద్ధలు కొట్టాడు వకీల్‌సాబ్.
తెలుగులో బాహుబలి-2 ట్రైలర్ విడుదలైన నాలుగు గంటల్లో 6 లక్షల 57వేల వ్యూస్ సాధించగా.. వకీల్ సాబ్ కేవలం నాలుగు గంటల్లోనే 6 లక్షల 59 వేల వ్యూస్ సాధించి, సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ పెర్ఫార్మెన్స్ తో ఎన్నో రికార్డులు యూట్యూబ్ గర్భంలో కలిసిపోయాయి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఈ టీజర్ విడుదలై 15 గంటలు దాటింది. ఇప్పటి వరకూ ఏకంగా 1.2 కోట్ల వ్యూస్ సాధించింది. ఇంకా శరవేగంగా దూసుకెళ్తోంది.
ఈ రికార్డులు పవర్ స్టార్ స్టామినాకు అద్దం పడుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే హైట్స్ లో ఉన్న వకీల్ సాబ్ మేనియా.. ట్రైలర్ తో ఆకాశాన్ని ఆవరించాయి. ఇక, సినిమా రిలీజ్ అయితే.. ఈ ప్రభంజనం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పతరం కాకుండా ఉంది. కోర్టు హాలులో పవన్ వాదించిన తీరు.. సోషల్ మీడియాలో రీసౌండ్ ఇస్తోంది. ఇక థియేటర్స్ లో డీటీఎస్ దెబ్బకు మోతెక్కిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమా విడుదలకు ఇంకా సరిగ్గా పదిరోజుల సమయం ఉంది. అప్పటి వరకు వకీల్ సాబ్ మేనియా ఎవరెస్టును తాకేలానే కనిపిస్తోంది.