
పవర్ స్టార్ అంటే.. ఒక ప్రభంజనం. ఇది ఇప్పటి వరకూ ఎన్నోసార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు మరోసారి కనిపిస్తోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ బొమ్మ వస్తుండడంతో.. ఫ్యాన్స్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. కేవలం 2 నిమిషాల టీజర్ నాడే రచ్చ రచ్చ చేశారు. దీంతో.. ఇక సినిమా రిలీజ్ వేళ ఎలా ఉంటుందో అనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో.. ఈ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు నిర్మాతలు పక్కా ప్లాన్ గీస్తున్నారు.
వకీల్ సాబ్ నిర్మాణంలో దిల్ రాజుతోపాటు బోనీకపూర్ భాగస్వామ్యం కూడా ఉంది. తెలుగు రాష్ట్రాలను దిల్ రాజు కవర్ చేస్తుంటే.. నేషనల్, ఇంటర్నేషనల్ వ్యవహారాలను బోనీకపూర్ చూస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మాగ్జిమమ్ థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఒకటీ రెండు మినహా.. మిగిలిన మల్టీఫ్లెక్స్ లు అన్నింటినీ వకీల్ సాబ్ కబ్జా చేయబతున్నాడు.
తెలుగు రాష్ట్రంలో మొత్తం కలిపి దాదాపు రెండు వేల థియేటర్లలో వకీల్ బొమ్మ పడనున్నట్టు తెలుస్తోంది. ఇక, దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ పవన్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత మేర రిలీజ్ చేయడానికి చూస్తున్నారు నిర్మాతలు. మొత్తంగా చూస్తే.. తెలుగునాట రెండు వేల.. రెస్టాఫ్ కంట్రీలో మరో రెండు వేలు కలిపి 4 వేల థియేటర్లలో వకీల్ సాబ్ గర్జించబోతున్నట్టు సమాచారం.
ఇక, ఓవర్సీస్ లోనూ పవర్ స్టార్ సత్తా చాటబోతున్నారు. విదేశాల్లో ఏకంగా 700 థియేటర్లలో వకీల్ సాబ్ రంగంలోకి దిగబోతున్నట్టు సమాచారం. కరోనా లాక్ డౌన్ తర్వాత ఒక భారతీయ సినిమా విదేశాల్లో ఈ స్థాయిలో రిలీజ్ కావడం ఇదే మొదటి సారి. పవర్ స్టార్ మేనియా భారీగా మొదలు కాబోతోంది.. క్యాచ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేశారు బోనీకపూర్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా వకీల్ సాబ్ మోత మోగిపోనుందని అర్థమవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్