
అవి ‘న్యాయం కావాలి’ సినిమా మొదలవుతున్న రోజులు. ఉదయం ఏడు గంటలకు అందరూ సెట్ కి వచ్చేశారు. ‘హా.. ఇతనేనయ్యా మన హీరో.. పేరు చిరంజీవి’ అంటూ నిర్మాత క్రాంతికుమార్ గారు చెబుతున్నప్పుడు ఎదురుగా ఒక కుర్రాడు, పక్కన ఉన్న మరో కుర్రాడి వైపు ఆసక్తిగా చూశాడు. మొదటి పరిచయంలోనే ఇద్దరికీ ఒకరి పై ఒకరికి అమితమైన నమ్మకం ఏర్పడింది.
ఆ నమ్మకంతోనే ఆ కుర్రాళ్లిద్దరిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగితే, మరొకరు దర్శక దిగ్గజం కోదండ రామిరెడ్డిగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఈ ‘న్యాయం కావాలి’ చిత్ర నిర్మాణ సమయంలోనే చిరు – కోదండ రామిరెడ్డి తొలిసారిగా కలిశారు. క్రాంతికుమార్ అంతకుముందు తన బ్యానర్ లో తీసిన ‘ప్రాణం ఖరీదు’ సినిమాలో చిరంజీవికి ఛాన్స్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు.
అందుకే క్రాంతికుమార్ పట్ల చిరు కూడా గురుభావంతో మెలిగేవారు. క్రాంతికుమార్ గారు కూడా ‘ఒరేయ్ చిరంజీవి’ అంటూ చిరును తన సొంత మనిషిలా చూసుకునే వారు. ఆ అనుబంధం వల్లే ‘న్యాయం కావాలి’ సినిమా ఆడుతూ పాడుతూ పూర్తి చేసేశారు. సినిమా ఫస్ట్ కాపీని క్రాంతి కుమార్ గారు తెప్పించుకుని చూశారు. ఎందుకో ఆయనకు సినిమా నచ్చలేదు.
దీనికితోడు సినిమా ఫస్ట్ కాపీ చూసిన వారంతా సినిమా బాగాలేదు అంటూ, రిజల్ట్ మీద సందేహం వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్స్ చేశారు. దాంతో క్రాంతికుమార్ గారిలో టెన్షన్ మరింతగా పెరిగింది. దీనికి తోడు సినిమాలో కొన్ని వివాదాస్పద డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆ డైలాగ్ లను మార్చమని క్రాంతికుమార్ గారు చెప్పినా దర్శకుడు కోదండ రామిరెడ్డి మాత్రం ఒప్పుకోలేదు.
దాంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. మిగిలిన యూనిట్ అందరూ క్రాంతి కుమార్ గారికే సపోర్ట్ చేస్తున్నారు. కానీ, చిరంజీవి ఒక్కరే కోదండ రామిరెడ్డి వైపు మాట్లాడుతున్నాడు. అది అసలు భరించలేకపోయారు క్రాంతి కుమార్ గారు. ‘నీకేమి తెలుసయ్యా ? ఇలా అయితే సినిమా ప్లాప్ అవుతుందీ !’ అంటూ సీరియస్ అవుతున్నా..
చిరంజీవి మాత్రం ఆయనను కూర్చోపెట్టి ఇలా ఉంటేనే సినిమా హిట్ అవుతుంది గురువుగారు’ అని రిక్వెస్ట్ చేసి, అలాగే సినిమాని రిలీజ్ అయ్యేలా చాల ప్రయత్నాలు చేశారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్. సినిమా మీద అంత జడ్జ్ మెంట్ ఉంది కాబట్టే, చిరంజీవి ‘మెగాస్టార్ చిరంజీవి’ అయ్యారు.