Homeప్రత్యేకంపీఆర్వో రారాజు 'బి.ఏ రాజు' ప్ర‌స్థానం నుండి విశిష్ట స్థానం వరకు !

పీఆర్వో రారాజు ‘బి.ఏ రాజు’ ప్ర‌స్థానం నుండి విశిష్ట స్థానం వరకు !

Raju
‘బి.ఏ రాజు’ ఇక లేరు అనగానే స్టార్లు సైతం ఎమోషనల్ అవుతున్నారంటే.. అది రాజు సాధించుకున్న గౌరవం. రాజు ఒక చిన్న సినిమా జర్నలిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టి, పీఆర్వోగా పరిణితి చెంది, నిర్మాత‌గా ఎదిగి తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకున్న ఘనుడు. అన్నిటికి మించి అందరి నోట అజాత శ‌త్రువు అనిపించుకున్న ఘ‌న‌త‌ కూడా రాజుకే దక్కుతుంది. రాజు మరణంతో మీడియా రంగంలో ఓ మ‌హా ప్ర‌స్థానం ముగిసిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. సినీ పాత్రికేయ లోకంలో ఆయనది అంతటి విశిష్ట స్థానం.

బి.ఏ రాజు సూపర్ స్టార్ కృష్ణ అభిమాని, ఆయన మీద అభిమానంతోనే సినిమా ప‌రిశ్ర‌మ‌కు వచ్చారు. ఆయన చివరి రోజు వరకూ కృష్ణ కుటుంబానికి న‌మ్మిన బంటుగానే ఉన్నారు. నిర్మాత‌గా ఎదిగినా, సినీ మీడియా రంగానికే మూల‌స్థంభంగా మారినా ‘బి.ఏ రాజు’ ఎప్పుడు ఎవరి దగ్గర అహాన్ని చూపించ లేదు. సహజంగా చిత్ర‌సీమలో ఎన్నో గొడవలు ఉంటాయి, జీవితాలను నాశనం చేసేంత ఇగో ఉంటుంది.

పైగా హీరోలకీ మీడియా సమస్థలకు, ఒక్కోసారి హీరోకీ – హీరోకీ కూడా ఓ వార‌ధి అవ‌స‌రం అవుతుంది. ఆ వారధికి నిన్నటివరకు పర్యాయపదం బి.ఏ రాజునే. సినిమా ఇండస్ట్రీలో నేడు ఎంతోమంది పీఆర్వోలు వచ్చి ఉండొచ్చు. కానీ పీఆర్వో రంగానికి మ‌కుటం లేని మ‌హారాజు అంటే బీఏ రాజునే. అవును మరి, దాదాపు వేయి సినిమాల‌కు పీఆర్వోగా ప‌నిచేయడం అంటే ఈ రోజుల్లో అది మరొకరికి సాధ్యమయ్యే పని కాదు.

పైగా రాజుగారు ‘సూప‌ర్ హిట్’ సైట్ ని, మరియు పత్రికను స్థాపించి మీడియా అధినేతగా కూడా ఆయన ఖ్యాతి గడించారు. అసలు ఓ సినిమా పీఆర్వో ప్ర‌తీ హీరో హృదయానికి దగ్గరవ్వడం బిఏ రాజుకు మాత్రమే సాధ్యం అయింది. అందుకే ఆయన అన్ని సినీ కాంపౌండ్ ల‌కు కావాల్సిన వ్యక్తి అయ్యాడు. రాజులో ఉన్న మరో గొప్ప తనం ఆయన నోటి నుంచి ఎన్నడూ ఫ్లాప్‌ అనే పదమే వ‌చ్చేది కాద‌ట. ఇది లౌక్యం అనుకోవచ్చు, కానీ ఇది ఆయన మంచితనం.

లౌక్యం అయితే, ఏదొక రోజు బయట పడుతుంది. పైగా అపోహలకు అనుమానాలకు పుట్టినిల్లు లాంటి సినిమా ఇండస్ట్రీలో కేవలం అతి మంచితనం ఉంటేనే అందరూ దగ్గరకు తీసుకుంటారు. రాజులో ఆ మంచితనం ఉంది కాబట్టే, ఆయన అందరికీ కావాల్సిన వాడు అయ్యాడు. ఇక ఏ సినిమా, ఏ సెంట‌ర్లో ఎంత వ‌సూలు చేసింది, ఆ సినిమా ఎన్ని కేంద్రంలో ఎన్ని రోజులు ఆడింది ? లాంటి విషయాలు రాజుకు వెన్నతో పెట్టిన విద్య. ఆయనలోని ఈ జ్ఞానమే ఆయనకు సినీ ప్రముఖులను దగ్గర చేసింది.

పైగా సీనియ‌ర్ పాత్రికేయుల నుంచి, కొత్త కుర్ర‌వాళ్ల వ‌ర‌కూ పేరు పెట్టి మర్యాదగా పిలవడం రాజులో ఉన్న మరో గొప్ప విషయం. అందుకే ఆయన అందరి మ‌న‌సుల్లో సుస్థిర‌స్థానాన్ని సంపాధించుకున్నారు. ఇక ఆయన స‌తీమ‌ణి, ద‌ర్శకురాలు బిఏ జ‌య మ‌ర‌ణం రాజుని బాగా కృంగ‌దీసిన మాట వాస్తవం. అప్పటినుండే ఆయనకు ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. రాజుకు ఒక కల ఉంది. తన త‌న‌యుడ్ని ద‌ర్శ‌కుడిగా చూసుకోవాలని, ‘బి.ఏ రాజు’ కుమారుడు శివ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ’22’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైయే లోపే ఆయన మరణించడం బాధాకరమైన విషయం.

బీఏ రాజుతో మహేశ్ బాబుకు ప్రత్యేక అనుబంధం ఉంది. మహేష్ చేసే ప్రతి సినిమాకు ఆయనే పీఆర్ఓగా పని చేస్తోన్నారు. అందుకే మహేష్ హెవీ ఎమోషనల్ అవుతూ.. ‘బీఏ రాజుగారి మరణ వార్తను నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నా చిన్నప్పటి నుంచి ఆయన నాకు తెలుసు. ఆయనతో చాలా కాలంగా ప్రయాణం చేస్తున్నాను. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నా’ అంటూ పోస్ట్ చేశాడు.

Writer: శివ కె

YouTube video player

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version