
సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందే. తమ తమ అకౌంట్లలో లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ ఆనంద పడుతుంటారు నెటిజన్లు. వాటిని వారి వారి ఫ్రెండ్స్ లైక్ చేయడం షేర్ చేయడం చేస్తుంటారు. ఇందులో తప్పు పట్టడానికి ఏమీ లేదు. ఎవరి ఇష్టం వారిది.
ఇదే పని స్టార్ హీరోలు కూడా చేస్తుంటారు. హీరోయిన్లు రెండాకులు ఎక్కువే చదివి ఉంటారు. హీరోలు తమ పిల్లలకు సంబంధించిన చిత్రాలు పోస్టు చేస్తుంటారు. అప్పుడప్పుడూ వెకేషన్ కు సంబంధించిన పిక్స్ కూడా అప్లోడ్ చేస్తుంటారు. అది కూడా వాళ్ల వ్యక్తిగతం కాబట్టి ఎవరికీ ఇబ్బంది లేదు. పైగా అభిమానులు కూడా ఉంటారు కాబట్టి.. వాళ్లు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులోనూ తప్పులేదు.
కానీ.. ఈ ఫొటోలను మీడియా నెత్తికి ఎత్తుకోవడం ఏంటన్నదే పాయింట్. ఎప్పుడో ఒకసారి రేర్ పిక్స్ గా వస్తే ఇబ్బంది లేదు. చూడ్డానికి కూడా బాగుంటుంది. కానీ.. నిత్యం అదే పనిగా మీడియాలో రావడమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబు ఆయన మనవడితో అప్పట్లో రిలాక్స్ అయ్యారు, ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ పిక్స్ కూడా రేర్ గానే బయటకు వస్తాయి. ఇలాంటివి ఎప్పుడో ఒకసారి వస్తాయి కాబట్టి.. వాటిని మీడియా చూపిస్తే బాగుంటుంది.
కానీ.. హీరోలు సోషల్ మీడియాలో పోస్టు చేసే ప్రతీ ఫొటో మీడియాలో కనిపించడం ఏమీ బాగోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందులోనూ ఓ స్టార్ హీరోకు సంబంధించిన సోషల్ మీడియా టీమ్ అతి చేస్తోందనే అభిప్రాయం వినిపిస్తోంది. సదరు హీరోలు అలా చేయాలని చెప్పే అవకాశం ఉండదు. కానీ.. తాము పలానా మీడియాలో ఫొటోలు వచ్చేలా చూశామని చెప్పుకోవడాని ఈ టీమ్ అతి చేస్తోందని అంటున్నారు. నిజానికి ఎప్పుడో ఒకసారి స్వీట్ తింటే బాగుంటుంది గానీ.. రోజూ అదే పనిగా తింటే వెగటు పుట్టేయదూ..!?