అప్పటి మహా నటుల జీవితాలకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా, అవి మీ కోసం. నటుడు చంద్రమోహన్ సతీమణి ప్రముఖ తెలుగు రచయిత్రి. ఆమె పేరేమిటో తెలుసా? జలంధర. ఆమె అగ్ని పుష్పం, ఎర్ర మందారాలు, చిత్రశిల, మైనపు బొమ్మ, సాలభంజిక లాంటి కథలు రాశారు. పున్నాగపూలు, స్మృతి చిహ్నం వంటి నవలలు రాశారు.
అలాగే అప్పటి క్రేజీ హీరో హరనాథ్ తండ్రి బుద్ధరాజు వరహాలరాజు గొప్ప చారిత్రక రచయిత, పరిశోధకుడు. శ్రీ ఆంధ్ర క్షత్రియ వంశ రత్నాకరము అనే గొప్ప మహద్గ్రంథాన్ని ఆయన రచించారు. అలాగే తన పరిశోధనలలో భాగంగా 900 గ్రామాలను సందర్శించారు.
అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు మద్రాసు పాండీబజారులో బ్యూక్ అనే ఫారిన్ మోడల్ కారు కొనుగోలు చేసిన వారిలో ప్రథముడు. మద్రాసు వీధులలో ఆ కారు తిరిగితే, అది కచ్చితంగా శివరావుదే అని ప్రజలు ఇట్టే చెప్పేసేవారు. అయితే తన చరమాంక దశలో శివరావు అదే పాండీ బజార్ వీధులలో సైకిల్ మీద తిరుగుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. అందుకు కారణం తాగుడికి బానిసై ఆర్థికంగా కూడా ఆయన చాలా నష్టపోవడం.
మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా కూడా అనేక చిత్రాలలో నటించారు. కానీ ఆయన గొప్ప రచయిత కూడా. తెలుగువారి జానపద కళారూపాలు, పోరాటాల రంగస్థలం, ఆంధ్రుల నృత్య కళావికాసం, తెలుగువారి చలన చిత్ర కళ లాంటి గొప్ప పరిశోధక గ్రంథాలను ఎన్నో రాశారు. అలాగే ప్రజానాట్యమండలి వ్యవస్థాపక సభ్యులలో మిక్కిలినేని కూడా ఒకరు.
అనేక తెలుగు పౌరాణిక చిత్రాలలో శకుని పాత్రను పోషించిన నటుడు ధూళిపాళ సీతారామశాస్త్రి. ఆయన పలు సాంఘిక సినిమాలలోని ప్రతినాయక పాత్రలలో కూడా రాణించారు. కానీ వార్థక్యం వచ్చాక ఆయన తన జీవితాన్ని భగవంతుడి సేవకే అర్పించారు. సన్యాస దీక్షను స్వీకరించారు. శ్రీ మారుతి సేవేంద్ర సరస్వతిగా పేరు మార్చుకొని ఆశ్రమం నిర్మించుకొని, అందులోనే నివసించారు.