వెండితెరపై మెగాపవర్ స్టార్ స్టామినా ఏంటన్నది అందరికీ తెలిసిందే. మెగా నట వారసత్వాన్ని సగర్వంగా టాలీవుడ్లో రెపరెపలాడిస్తున్నాడు. నవరసాలనూ అద్వితీయంగా పలికిస్తూ.. ప్రేక్షకుల జేజేలు అందుకుంటున్నాడు. ఇది చూడగానే తెలిసిపోయే విషయం. కానీ.. ఆఫ్ ది స్క్రీన్లో చెర్రీ ఏంటీ? ఎలా ఉంటాడు? మనస్తత్వం ఏంటీ? అనేది మాత్రం దగ్గరగా ఉన్నవారికి మాత్రమే అర్థమయ్యే విషయం. వాళ్లందరూ చెప్పేమాట ఏమంటే.. చరణ్ అందరనీ ప్రేమిస్తాడు.. అందుకే మేం కూడా అతన్ని ప్రేమిస్తాం అంటున్నారు. ఈ బర్త్ డే సందర్భంగా.. కుటుంబ సభ్యులు, మిత్రులు రామ్ చరణ్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం.
చిరంజీవిః నటుడిగా ఎంతో ఎదిగాడు. నటన, డ్యాన్స్ లో నన్ను మరిపిస్తున్నాడు. ఖైదీ సినిమా నాకెంత పేరు తెచ్చిందో.. రంగస్థలం చరణ్ కు అంత పేరు తెచ్చింది. టీనేజ్ లో గుర్రపు స్వారీ నేర్పించాను. అది మగధీర సమయంలో ఉపయోగపడింది. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనూ మరోసారి స్వారీ చేయబోతున్నాడు. సైరా సినిమాతో నా కల నెరవేర్చాడు. కొడుకుని చూసి తండ్రిగా గర్విస్తున్నాను.
పవన్ కల్యాణ్ః అన్నయ్య షూటింగుల్లో బిజీగా ఉన్నప్పుడు చెర్రీ నా దగ్గరే ఎక్కువగా ఉండేవాడు. ఓ సారి ఫారెన్ తీసుకెళ్లాను. అక్కడ అల్లరి చేయకుండా గిచ్చేవాణ్ని. మేమిద్దరం చాలా సరదాగా ఉంటాం.
ఉపాసనః చెర్రీ సినిమాలకు సంబంధించిన విషయాలను నేను పెద్దగా పట్టించుకోను. కానీ.. ఆయన ఆహారం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటాను. ఇక, చెర్రీ బయట ఎలా ఉన్నా.. ఇంట్లో మాత్రం చాలా సరదాగా ఉంటాడు. సెన్సాఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ.
అల్లు అర్జున్ః చెర్రీ నేను చిన్నప్పటి నుంచీ కలిసే పెరిగాం. తనలో స్టార్ హీరో కొడుకును అన్న గర్వం ఎప్పుడూ కనిపించేది కాదు. ఎంత గొప్ప స్థాయికి చేరినా కష్టపడతాడు. అందుకే చరణ్ అంటే నాకు చాఆ ఇష్టం. మెగాస్టార్, పవర్ స్టార్ తర్వాత ఆ స్థాయిలో ఉండే అర్హత చరణ్ కు మాత్రమే ఉంది.
వరుణ్ తేజ్ః చిన్నప్పుడు నాకు చీకటి అంటే.. భయం. ఇది తెలిసిన అన్నయ్య నన్ను భయపెట్టేవాడు. పెద్దయ్యాక భయం పోయింది. నటనలో అన్నయ్యను చూసి చాలా నేర్చుకున్నాను. నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే అన్నయ్య గుర్తొస్తాడు.
జూ.ఎన్టీఆర్ః రామ్ చరణ్ మంచి నటుడు. కష్టసుఖాలను పంచుకునే మంచిమిత్రుడు. చరణ్ కు , నాకు మధ్య స్నేహం ఎప్పటి నుంచో ఉంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత అది మరింత పెరిగింది. ఈ స్నేహం ఇలాగే కొనసాగాలని ఆ దేవుణ్ని కోరుకుంటున్నాను.
రానాః చరణ్ నేనూ మంచి స్నేహితులం. చదువుకునే రోజుల్లో బాగా అల్లరి చేసేవాళ్లం. కాలేజీ బంక్ కొట్టి తిరిగేవాళ్లం. ఇప్పటికీ మా స్నేహం అలాగే ఉంది. తరచూ కలుస్తుంటాం. మా ఇష్టాలు దాదాపు ఒకేలా ఉంటాయి. చరణ్ హార్డ్ వర్క్ కు హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.
రాజమౌళిః చరణ్ నటన అద్భుతంగా ఉంటుంది. మగధీర క్లైమాక్స్ లో కాజల్ కు ప్రేమ గుర్తు చేయలేపోతున్న నిస్సహాయతను అద్భుతంగా పలికించాడు. ఇప్పటికి చరణ్ నటనలో ఎంతో పరిణతి ఉంది.