Rajamouli : ‘‘సినిమా దర్శకులు అందరూ రన్నింగ్ రేసులో పరుగులు పెడుతున్నారు.. ఎవరికి వారు నెంబర్ వన్ కిరీటాన్ని సాధించేందుకు శక్తివంచన లేకుండా.. బలాన్ని కూడదీసుకొని పరిగెడుతున్నారు. కొన్ని సినిమాల వరకు అందరికన్నా మూడ్నాలుగు అడుగులు ముందుగా పరిగెట్టిన రాజమౌళి.. బాహుబలి తర్వాత మిగిలిన దర్శకుల కంటికి కనిపించనంత వేగంగా ముందుకు వెళ్లిపోయాడు.’’ ఇదీ.. జక్కన్న గురించి ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాట. ఇది అక్షరాలా నిజమే అన్నట్టుగా ఉంది పరిస్థితి.

తెలుగు సినిమాలోనే కాదు.. భారతీయ సినిమాలోనూ ఆయన్ను బీట్ చేసే దర్శకుడు లేడన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అలాంటి దర్శకుడు సోమవారం సెప్టెంబరు 27తో సినిమా దర్శకుడిగా 20 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఆయన తొలి చిత్రం 2001 సంవత్సరంలో ఇదే రోజున విడుదలైంది. మరి, ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన చిత్రాలెన్ని? అవి సాధించిన కలెక్షన్స్ ఎంత? అన్నది చూద్దాం.

స్టూడెంట్ నెంబర్ 1ః ఈ చిత్రానికి 2 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యింది. మొదటి చిత్రం కావడంతో ప్రీ- రిలీజ్ బిజినెస్ 2.75 కోట్ల మేర జరిగింది. అయితే.. కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి. ఏకంగా 12 కోట్లు సాధించిందీ చిత్రం.

సింహాద్రిః జక్కన్న తన రెండో చిత్రాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే తీశాడు. 8 కోట్లు ఖర్చు చేశారు. ప్రీ రిలీజ్ బిజినెస్ 13 కోట్లు జరిగింది. కలెక్షన్స్ 26 కోట్లు సాధించింది.

సైః ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు. బిజినెస్ 7 కోట్ల మేర జరిగింది. కలెక్షన్స్ మాత్రం 9.5 కోట్లు సాధించింది.

ఛత్రపతిః ప్రభాస్ కు స్టార్ డమ్ తెచ్చిన చిత్రాల్లో ఛత్రపతి కూడా ఒకటి. ఈ చిత్రాన్ని 10 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ 13 కోట్లు నడించింది. కలెక్షన్ష్ 21 కోట్లు సాధించింది.

విక్రమార్కుడుః రవితేజ డ్యుయల్ రోల్ లో అలరించిన ఈ చిత్రం 11 కోట్లతో తెరకెక్కించింది. బిజినెస్ 14 కోట్ల వరకు జరిగింది. కలెక్షన్ష్ 23 కోట్లు వచ్చాయి.

యమదొంగః జూనియర్ తో తీసిన హ్యాట్రిక్ మూవీ ఇది. బడ్జెట్ 18 కోట్లు. ప్రీ-రిలీజ్ బిజినెస్ 22 కోట్ల మేర సాగింది. 29 కోట్లు రాబట్టింది.

మగధీరః అప్పటి వరకు ఒక సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఉన్న రాజమౌళిని.. దర్శక ధీరుడిగా మార్చిన చిత్రమిది. ఈ చిత్రానికి ఏకంగా 44 కోట్లు ఖర్చు చేశారు. అప్పట్లో ఇదో సంచలనం. బిజినెస్ 48 కోట్ల మేర సాగింది. కానీ.. ఊహించని విధంగా 78 కోట్లు కొల్లగొట్టింది.

మర్యాద రామన్నః జక్కన్న కెరీర్ లో పూర్తి భిన్నంగా తెరకెక్కిన చిత్రమిది. బడ్జెట్ 14 కోట్ల. బిజినెస్ 20 కోట్ల మేర సాగింది. కలెక్షన్స్ మాత్రం 29 కోట్లు సాధించింది.

ఈగః రాజమౌళి విజన్ కు అద్దం పట్టిన చిత్రమిది. లేని ఈగను ఉన్నట్టుగా చూపించడమే కాకుండా.. మెప్పించాడు. గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిత్రానికి 26 కోట్లు ఖర్చైంది. 32 కోట్లు బిజినెస్ చేసిన ఈ చిత్రం.. 45 కోట్లు రాబట్టింది.

బాహుబలి 1ః జక్కన్న విజువల్ వండర్ ఇది. ఈ పార్టుకు 136 కోట్లు ఖర్చు చేశారు. బిజినెస్ 191 కోట్లు అయ్యింది. కలెక్షన్స్ మాత్రం ఎవ్వరి ఊహకూ అందని విధంగా 600 కోట్లు సాధించింది.

బాహుబలి2ః బడ్జెట్ రెండు భాగాలకూ కలిపి 250 కోట్ల మేర అయ్యింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ 380 కోట్లు అయ్యింది. కలెక్షన్స్ 854 కోట్లు సాధించింది.

ఆర్ ఆర్ ఆర్ః దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ-రిలీజ్ బిజినెస్ 550 కోట్లుగా ఉన్నట్టు అంచనా. మరి, ఎంత రాబడుతుంది? అన్నది చూడాలి.