
‘మోడ్రన్ ఋషి’ పూరి జగన్నాథ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తెలియని ఎన్నో విషయాలను తెలియజేసే క్రమంలో ఈ రోజు కొత్త టాపిక్ తో వచ్చాడు. టాపిక్ ఏమిటంటే ‘పేదరికం’. అవును దీని గురించి చాలా మందికి తెలుసు. మరి పూరి మాటల్లోనే విందాం. ‘పేదరికం’. ‘డబ్బులో పుట్టి డబ్బులో పెరుగుతున్న రిచ్ కిడ్స్, అలాగే ఏ కష్టం తెలియకుండా తల్లిదండ్రుల చాటున వారి నీడలో సుఖంగా పెరుగుతున్న బంగారాల కోసం చెబుతుంది ఇది.
మనం అందరం ఏ కష్టం తెలియకుండా మన పిల్లల్ని పెంచాలని చూస్తాం. ప్రయత్నిస్తాం. అది చాలా పెద్ద తప్పు. గుర్తుపెట్టుకోండి. పిల్లలకు కష్టం తెలియాలి. వాళ్ళకి యుద్ధం తెలియాలి. యుద్ధం నేర్పకపోతే మీ కొడుకు అలెగ్జాండర్ కాలేడు. యుద్ధం చేయాలంటే వాడు కత్తి పట్టాలి. రక్తం చిందాలి. అప్పుడే వాళ్ళు గట్టిగా నిలబడగలరు.
నిజానికి పేదరికం అంటే, ఎవరికీ నచ్చదు. అందులో ఉండాలని ఎవరూ కోరుకోరు. మనమే కాదు, అందరూ డబ్బు కావాలనే కోరుకుంటారు. డబ్బు కోసం ఎంతో కష్టపడతారు. తప్పులేదు. కానీ ఒక పేదవాడిగా మాత్రమే ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే జీవితంలో ఒక్కసారైనా పేదవాడిగా బతికి చూడండి.
ఒకేసారి ఇలా ట్రై చేసి చూడండి. కనీసం ఒక్క నెలరోజులైనా వేరే ఊరు వెళ్లి మీ కష్టం మీదే మీరు బతకండి. జీవితం విలువే కాదు, కష్టం, కన్నీళ్లుకు సరైన నిర్వచనం కూడా తెలుస్తోంది. ఇది కూడా ఒకేసారి ట్రై చేయండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని మీ అమ్మనాన్నలకు ఇచ్చి చూడండి. ఇన్నాళ్లు మీకోసం వాళ్లు ఎంత చేశారో ఆర్డమవుతుంది’ అంటూ పూరి చెప్పుకొచ్చాడు.