ఎవ్వరూ ఊరికే సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోరండీ. ఆ స్టార్ డమ్ వెనుక ఎవ్వరికీ తెలియని కలల పోరాటం ఉంటుంది. ఒక్కోసారి ఒళ్ళు హూనం అవుతున్నా.. వెనుకడుగు వేయని తెగువ ఉంటుంది. అవి ‘ఖైదీ’ సినిమా షూటింగ్ జరుగుతున్న రోజులు.. కరెక్ట్ గా చెప్పాలంటే 1982వ సంవత్సరం.. ఆ రోజుల్లో సినిమా షూటింగ్ అంటే అదొక స్వర్గధామం అని ప్రజలు అనుకుంటున్న రోజులు అవి. అయితే ఓ రోజు అరటితోటలో షూటింగ్ చేస్తున్నారు చిరంజీవి. ఖైదీ సినిమాలో ఈ అరటి తోట సీన్ చాల ముఖ్యమైనది.
అందుకే మెగాస్టార్.. సారీ, అప్పుడు ఇంకా జస్ట్ చిరంజీవినే. ఆ సీన్ ను చాల బాగా చేయాలని అప్పటికే ఒకటికి నాలుగు సార్లు ప్రాక్టీస్ చేసి వచ్చారు. కానీ అరటి చెట్లను ఆవేశంగా నరకాలి, దాంతో చిరు పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి.. ఆవేశాన్ని ఎమోషన్ని ఒకే ఎక్స్ ప్రెషన్ లో పలికించారు. దాంతో అక్కడ ఉన్న వారంతా చప్పట్లతో చిరు నటనకు నీరాజనాలు పలుకుతున్నారు. దర్శకుడు కోదండరామిరెడ్డి కూడా సంతోషంగా క్లాప్స్ కొడుతూ షాట్ కి కట్ చెప్పారు.
అంతే, కట్ చెప్పగానే ఉన్నట్టు ఉండి చిరంజీవి నేల పై కుప్పకూలిపోయారు. నడవలేక పోతున్నారు. అప్పటికీ గానీ, అక్కడ ఉన్న వారందరికీ జరిగింది అర్ధం కాలేదు. సీన్ చేస్తోన్న క్రమంలో చిరు కాలు బెణికి మడత పడింది. తీరా చూస్తే నడవలేని పరిస్థితి వచ్చింది. అప్పటికే నెప్పితో చిరంజీవి విపరీతంగా బాధ పడుతున్నారు. అందరూ కంగారుపడి చూస్తే, చిరు కాలు బాగా వాచిపోయి కనిపించింది. కాలు బెణికినప్పుడే చెప్పి ఉంటే అంత బాగా వాచేది కాదు.
కానీ ముందే చెబితే షూట్ మధ్యలోనే ఆపేస్తారు అని చిరు నెప్పిని ఓర్చుకున్నారు తప్ప ఆ విషయం బయటకు చెప్పలేదు. షూటింగ్ అయిపోయిన తరువాతే, చెన్నైకి వెళ్లి కట్టు కట్టించుకున్నారు. ఈ సంఘటనను బట్టి చిరు ఆ రోజుల్లో సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అర్ధం అవుతుంది. పైగా చిరు హార్డ్ వర్క్ గురించి ఇప్పుడు కొత్తగా ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు కూడా. అంత కష్టపడ్డారు కాబట్టే.. ఖైదీ సినిమా తరువాత చిరుకి, మెగాస్టార్ రేంజ్ స్టార్ డమ్ వచ్చింది.
ఆ ఒక్క సినిమాతోనే చిరుని కాబోయే నెంబర్ వన్ హీరో అన్నారు. ఆ తరువాత మెగాస్టార్ అనే బిరుదు కూడా చిరుకి ఆభరణంగా మారింది. అయితే మెగాస్టార్ అనిపించుకున్న తరువాత కూడా, ఉదయం నుంచి డ్యాన్సులు చేసీ చేసీ చిరంజీవి ఒళ్లు హూనం చేసుకునేవారు. కేవలం అభిమానులను అలరించడానికే, అంతగా కష్టపడేవారాయన. ప్రతి పాత్రకు ప్రాణం పోసేవారు. అందుకే అప్పటి సినిమాల విషయంలో ఆయన ఇప్పటికీ గర్వంగా ఫీలవుతుంటారు.