పాత్రల కోసం నటుడు ఎదురు చూడడం అతి సహజం.. పాత్రలే నటుడి కోసం ఎదురు చూడడం.. అత్యంత అరుదు! అలాంటి అరుదైన నటుడే ప్రకాశ్ రాజ్. కథా రచయితలు ఆయన కోసం ప్రత్యేక పాత్రలను సృష్టిస్తుంటారంటే అతిశయోక్తి కాదు. రంగస్థల నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన.. ఐదారు భాషల్లో వందలాది పాత్రల్లో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకనిర్మాతగా సినీరంగానికి ఎనలేని సేవలందించారు. ఇప్పటికీ.. అద్భుతమైన ఫామ్ తో దూసుకుపోతున్నారు. శుక్రవారం (మార్చి 26) ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సినీ జర్నీని ఓ సారి తరచి చూద్దాం…
రంగస్థల నటుడిగా ప్రేక్షకులు కొట్టే చప్పట్లతో మురిసిపోయిన ఆయన.. ఎలాగైనా సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నారు. ఆ విధంగా ఎన్నో ప్రయత్నాల తర్వాత ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వేగంగా ప్రకాశ్ రాజ్ పేరు మారుమోగడం మొదలైంది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘ఇద్దరు’ చిత్రం ద్వారా ఉత్తమ సహాయ నటుడి విభాగంలో జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత ప్రకాశ్ రాజ్ నటనా ఖ్యాతి దేశవ్యాప్తమైంది.
తెలుగు ప్రేక్షకులకు విలన్ పాత్రల ద్వారానే సుపరిచితుడైన ప్రకాష్ రాజ్.. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో ప్రతినాయకుడిగా కనిపించి, మెప్పించారు. ఒక్కడు సినిమాలో ఆయన పోషించిన పాత్రను ఎవ్వరూ మరిచిపోలేరు. ఇక, సుస్వాగతం సినిమాలో ‘నేను మోనార్క్ ని. నన్నెవరూ మోసం చేయలేరు’ అంటూ ఆయన పలికిన సంభాషణలు ఎవర్ గ్రీన్. ఇలా ఒకటా రెండా? బద్రి, అంతఃపురం, ఇడియట్, ఖడ్గం, పోకిరి, బొమ్మరిల్లు, నువ్వు నాకు నచ్చావ్.. వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన పోషించిన నటన అమోఘం, అనన్యసామాన్యం.
ఇక దర్శకుడిగానూ తనదైన ముద్రదేశారు ప్రకాశ్ రాజ్. కన్నడలో ఆయన రూపొందించిన ‘నాను నాన్న కనసు’ అనే చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘ఉలవచారు బిర్యానీ’ వంటి సినిమాలు తీశారు. నిర్మాతగానూ పలు చిత్రాలు రూపొందించారు. వెండి తెరపై ఆయన సృష్టించిన అద్భుతాలకు అవార్డులు వరుస కట్టాయి. ఉత్తమ నటుడు, సహాయ నటుడిగా జాతీయ అవార్డులు, ఐదు సార్లు ఫిలిం ఫేర్, ఆరు సార్లు నంది, నాలుగుసార్లు తమిళరాష్ట్ర అవార్డు, మూడు సార్లు విజయ అవార్డు, ఒకసారి ఇంటర్నేషనల్ తమిళ్ ఫిల్మ్ పురస్కారం దక్కించుకున్నారు.
ఇప్పటికీ నటుడిగా ఫుల్ బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్, పుష్ప, నారప్ప, కేజీఎఫ్-2, అన్నాత్తే, తలైవి వంటి చిత్రాలతో తీరికలేకుండా నటిస్తున్నారు ప్రకాశ్ రాజ్. కేవలం సినిమా నటుడిగానే కాకుండా.. సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా సామాజిక సమస్యలపై గళం విప్పుతుంటారు. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కొండరెడ్డి పల్లి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ప్రభుత్వాల అన్యాయాలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుంటారు. ఈ విధంగా.. అటు నటుడిగా, ఇటు సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా పురోగమిస్తున్న ప్రకాశ్ రాజ్.. నూరేళ్లు చల్లగా జీవించాలని ఆశిద్దాం.