
తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా లేడీ డైరెక్టర్ సుధా కొంగర కలయికలో వచ్చిన “ఆకాశం నీ హద్దు రా” సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ ఐదుగురు స్టార్ హీరోల చిత్రాల్లో ఈ చిత్రం తొలి చిత్రంగా నిలవడంతో పాటు.. ప్రపంచ సినిమాల్లోనే మూడో స్థానంలో నిలిచింది. పైగా అమెజాన్ ప్రైమ్ టైంలో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన సినిమాగా కూడా ఈ చిత్రం రికార్డు కెక్కింది.
ఇక ప్రపంచ సినీ ప్రస్థానంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల పోటీలో కూడా ఈ చిత్రం నిలబడిన సంగతి తెలిసిందే. ఉత్తమ చిత్రం, ఉత్తమ హీరో, ఉత్తమ హీరోయిన్ కేటగిరిల్లో నామినేషన్ అయిన ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రాకపోయినా.. ఇండియన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన మేటి సినిమాగా ఘనత సాధించింది.
అన్నిటికీ మించి అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో బెస్ట్ డైరెక్టర్ గా సుధా కొంగర, బెస్ట్ హీరోగా సూర్య, బెస్ట్ హీరోయిన్ గా అపర్ణ బాలమురళికి అవార్డులను తెచ్చిపెట్టింది. ఇక ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ సాధించిన 1000 చిత్రాల్లో ఈ సినిమా మూడో స్థానంలో నిలవడం అంటే అది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దక్కిన మరో గౌరవం.
అలాగే ఐఎమ్‌డీబీ లాంటి ప్రముఖ వెబ్ సైట్ చేసిన సర్వేలో 9.3 రేటింగ్ సాధించి ఫస్ట్ ప్లేస్ లో ‘ది షషాంక్ రెడెంప్షన్’ అనే చిత్రం నిలవగా, ‘ది గాడ్ ఫాదర్’ చిత్రం 9.2 రేటింగ్ తో రెండో స్థానాన్ని దక్కించుకోగా, 9.1 రేటింగ్ సాధించి ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళంలో సూరరై పోట్రు) చిత్రం మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. మంచి ప్రశంసలు అందుకుంటూ.. రికార్డ్స్ క్రియేట్ చేసింది. విమర్శకుల నుంచి కూడా మంచి రేటింగ్స్ పొందింది అంటే.. అది సుధా కొంగర గొప్పతనమే.