F. C. Kohli: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.. తెలుగులో చెప్పాలంటే సాంకేతిక సమాచార పరిజ్ఞానం.. భారత్ అత్యధికంగా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తున్న విభాగంలో కీలకమైనది ఇదే. దీని ద్వారా 200 బిలియన్ డాలర్ల ఆదాయం భారతదేశానికి ఏటా వస్తోంది. 50 లక్షల మంది దీని ఆధారంగా ఉపాధి పొందుతున్నారు.. కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అనే కంపెనీ 25 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంతో కొనసాగుతోంది.. అంతేకాదు ఆరు లక్షల మందికి ఉపాధి ఇస్తోంది.. ఐటీ సర్వీస్ బ్రాండ్లలో రెండో ర్యాంకులో కొనసాగుతోంది. దేశీయ ఐటీ రంగం అభివృద్ధికి ఇంతకు మించి గణాంకాలు ఏం ఉంటాయి. మరి ఇంతటి అభివృద్ధి వెనుక.. ఇన్ని కోట్ల ఆదాయం వెనుక.. ఆయన హస్తం ఉంది.. అన్నింటికీ మించి నాలుగు దశాబ్దాల ముందుచూపు ఉంది.. అదే ఇవాళ భారతదేశాన్ని ఐటి రంగంలో ముందంజలో ఉంచింది. ఇకపై ఉంచుతుంది కూడా.
ముందుచూపు
డాక్టర్ ఎఫ్. సీ కోహ్లీ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సహా వ్యవస్థాపకుడు. ఆయన దార్శనికత వల్లే టిసిఎస్ రూపుదిక్కుంది. అది క్రమక్రమంగా ఎదిగి ఈరోజు దేశాన్ని ఐటి రంగంలో అగ్ర భాగాన నిలబెట్టింది. ముఖ్యంగా సేవల రంగంలో అమెరికాను నెట్టి భారత్ ప్రపంచ పెద్దన్నగా ఎదగడం మామూలు విషయం కాదు. సరిగ్గా రెండేళ్ల క్రితం కోహ్లీ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లారు. ఇప్పుడు ఉండి ఉంటే చాలా సంతోషపడేవారు. మనదేశంలో మానవ వనరుల సామర్థ్యం పై కోహ్లీకి ఎంతగానో విశ్వాసం ఉండేది. నాస్ కామ్, కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలను డాక్టర్ కోహ్లీ ఎంతగానో సమర్థించారు. ఐటీరంగం మన దేశానికి గొప్ప అవకాశం అని, ఆయన నాలుగు దశాబ్దాల క్రితమే గుర్తించారు. అహ్మదాబాద్ లో 1975లో జరిగిన కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు దేశ ఐటీ రంగానికి బలమైన పునాది వేశాయి. “ఎన్నో ఏళ్ల క్రితం మనం పారిశ్రామిక విప్లవాన్ని అందుకోలేకపోయాం.. ఇప్పుడు అటువంటి కొత్త విప్లవం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూపంలో కనిపిస్తోంది.. దీనికి యంత్రాలు, యంత్ర పరిజ్ఞానం అవసరం లేదు. తార్కిక పరిజ్ఞానం ఉంటే చాలు.. అది భారతీయులకు ఎంతో ఉంది. కష్టపడే తత్వం భారతీయులకు ప్రధాన బలం.. అదే మన దేశాన్ని ఐటి రంగంలో ముందంజలో ఉంచుతుంది” అని ఆ రోజుల్లోనే ఆయన విశ్వసించారు.. చాలా తన ఆలోచనలకు అనుగుణంగా ఐటీ రంగాన్ని మలిచారు.. ఆయన వేసిన అడుగులే ఈరోజు ఐటిరంగం ఎన్నో అద్భుతాలు సృష్టించేందుకు దోహదపడుతున్నాయి.
నాడే గుర్తించారు
కృత్రిమ మేధ గురించి ఎంతోమంది ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు.. కానీ కోహ్లీ ఎన్నో ఏళ్ల క్రితమే దీని ప్రాధాన్యం గుర్తించారు.. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లోని పరిశోధన విభాగమైన టాటా రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ డిజైన్ సెంటర్ లో 1990 లోనే ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ కృత్రిమ మేధ, నాలెడ్జ్ బేస్డ్ సిస్టమ్స్ ప్రస్తావన ఐటీ రంగానికి కొత్త దిశ చూపింది.. అప్పట్లో ఇంజనీరింగ్ డిగ్రీలో కృత్రిమ మేధ ఆప్షనల్ సబ్జెక్టుగా ఉంది. దీని ప్రాముఖ్యతను గుర్తించి తప్పనిసరి సబ్జెక్టుగా చేయాలని ఆయన ఆ రోజుల్లోనే సూచించారు. ఐఐటీలు, ఎన్ఐటీలు, కొన్ని యూనివర్సిటీల పాలకవర్గాలతో మాట్లాడి ఒప్పించారు కూడా.. టిసిఎస్ మద్దతుతో హైదరాబాద్ ఐఐఐటిలో కోహ్లీ సెంటర్ అండ్ ఇంటిలిజెంట్ సిస్టం కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు స్ఫూర్తి ప్రధాత కూడా ఆయనే.
ఎలక్ట్రానిక్, హార్డ్ వేర్ రంగంలో సైతం
సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశాన్ని కొట్టే దేశం మరొకటి లేదు. కానీ ఎలక్ట్రానిక్ హార్డ్వేర్, తయారీ రంగంలో మాత్రం అప్పట్లో చైనా, తైవాన్ దేశాలు గణనీయమైన విజయాలు సాధించేవి.. అయితే వీటిని డాక్టర్ కోహ్లీ ఆసక్తికరంగా గమనించేవారు.. తరచూ ఆ దేశాలను సందర్శించేవారు.. అక్కడి తయారీ విధానాలు అనుసరించి, మనదేశంలోనూ ప్రారంభిస్తే ప్రగతి సాధిస్తుందని కోహ్లీ విశ్వసించేవారు.. తైవాన్, గ్రేటర్ చైనా రీజియన్ హార్డ్వేర్ పరిశ్రమలు, డాక్టర్ కె. టి. లి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తైవాన్ హెడ్ డాక్టర్ ఎఫ్. సీ. లిన్ లను కలవడమే గాక, వారిని మన దేశానికి ఆహ్వానించారు. ఎయిర్ ఇండియా భవనంలో వారికి ప్రత్యేక ఆతిథ్యం ఇచ్చారు.. ఈ పరిణామంతో దేశంలో హార్డ్వేర్ పరిశ్రమ రూపురేఖలు మారిపోయాయి.
హైదరాబాదు తో అనుబంధం
డాక్టర్ కోహ్లీ తరచుగా హైదరాబాద్ వచ్చేవారు.. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి హర్షం వ్యక్తం చేసేవారు.. సైబరాబాద్ ప్రాంతంలో ఏర్పాటు అవుతున్న ఐటీ కంపెనీలను నిశితంగా గమనించేవారు.. పలు సందర్భాల్లో నాణ్యమైన మానవ వనరులు మాత్రమే కాకుండా… మిగతా వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలని సూచించేవారు. కంపెనీ అవసరాలకు అనుగుణంగా వారిని మార్చుకోవాలని చెప్పేవారు.. ఆయన ముందు చూపు వల్ల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తొలిసారి నాలెడ్జి సెంటర్ ఏర్పాటు చేసింది.. ఉద్యోగులకు ఇందులో శిక్షణ ఇచ్చేవారు.. ప్రపంచంలో మారుతున్న పరిణామాలపై అవగాహన కల్పించేవారు.. దీనివల్ల ఉద్యోగుల్లో నేర్చుకోవాలి అనే జిజ్ఞాస పెరిగింది. ఫలితంగా నాణ్యమైన మానవ వనరులు కంపెనీకి లభ్యమయ్యేవి.. చేపట్టే ప్రాజెక్టుల్లో నవ్యత, నాణ్యత ఉండడంతో.. వివిధ దేశీయ మార్కెట్లలో గిరాకీ బాగుండేది. నాడు డాక్టర్ కోహ్లీ వేసిన నాలెడ్జి సెంటర్ అడుగు.. ఇవ్వాళా అన్ని కంపెనీలకూ పాకింది. డాక్టర్ కోహ్లీ చేసిన సేవలకు గుర్తుగా హైసియా ఆయనకు జీవనకాల సాఫల్య పురస్కారాన్ని అందజేసింది.