Auto Sector: ప్యాసింజర్ వాహనాల (పీవీ) విక్రయాలు మందగించడంతో ఆటో డీలర్లు పెద్ద ఇబ్బందుల్లో పడ్డారు. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. ఆటో డీలర్లతో వాహనాల స్టాక్ ప్రస్తుతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. ఏడు లక్షలకు పైగా వాహనాలు డీలర్ల వద్ద నిల్వ పేరుకుపోయాయి. వాటి మొత్తం విలువ దాదాపు రూ.73,000 కోట్లు. జూలై ప్రారంభంలో 70-75రోజులుగా ఉన్న స్టాక్ ఇప్పుడు 80-85రోజులకు పెరిగిందని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ పేర్కొంది. దీంతో డీలర్లపై ఒత్తిడి పెరుగుతోంది. అందుకే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఎఫ్‌ఎడిఎ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా అన్నారు. ఈ అధిక స్థాయి ఇన్వెంటరీ కారణంగా డీలర్లు అప్రమత్తంగా ఉండాలని ప్యాసింజర్ వాహన తయారీదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశంలో వాహన రిటైల్ విక్రయాలు, వార్షిక ప్రాతిపదికన ఆగస్టు నెలలో 9శాతానికి పైగా తగ్గాయి. కొనుగోళ్లు తగ్గడంతో ప్రయాణికుల వాహనాల (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) నిల్వలు రికార్డు స్థాయికి చేరాయని వాహన డీలర్ల సమాఖ్య ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) తెలిపింది. వాహన తయారీ కంపెనీలు (ఓఈఎం) ఈ పరిస్థితిని గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని ఫాడా కోరింది. 2023 సెప్టెంబరు నెలలో మొత్తం 18,99,192 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ఆగస్టులో అవి 17,23,330కి పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన (పీవీ) విక్రయాలు 3,39,543 నుంచి 19శాతానికి తగ్గి 2,75,681కి పరిమితమయ్యాయి. వినాయక చవితి, ఓనం వంటి పండుగల సీజన్ లోనూ రిటైల్ విక్రయాలు తగ్గాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ వెల్లడించారు. సీజనల్ అంశాలతో పాటు భారీ వర్షాలు ఈ పరిస్థితిని మరింత తీవ్రతరం చేశాయని వివరించారు. ఇంతటి అధిక నిల్వలు గతంలో ఎప్పుడూ లేవన్నారు.
ఎఫ్‌ఎడిఎ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ, “రిటైల్ అమ్మకాల గణాంకాలకు అనుగుణంగా కార్ కంపెనీలు తమ ఉత్పత్తిని రీసెట్ చేయాలి. డీలర్లకు పంపే వాహనాల సంఖ్యను తగ్గించాలి. ఆటో డీలర్‌లతో వాహన ఇన్వెంటరీ సగటున 30 రోజులు ఉండాలి. కొన్ని సందర్భాల్లో దీనిని ఒక వారం పాటు పొడిగించవచ్చు. ఫెస్టి సీజన్ ను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ ప్రారంభంలో వాటిని మళ్లీ పెంచుకోవచ్చని ఆయన చెప్పారు. ఎఫ్‌ఎడిఎ డేటా ప్రకారం.. భారతదేశంలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు జూలైలో 10 శాతం పెరిగి 3,20,129 యూనిట్లకు చేరుకున్నాయి. అయితే, అదే నెలలో, ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం తగ్గి 3.41 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్‌లో అన్ని విభాగాల్లో మొత్తం 1,19,15,963 వాహనాలు రిటైల్ గా విక్రయించబడ్డాయి. ఏడాది క్రితం ఇదే కాలంలో విక్రయించిన 1,11,83,734 వాహనాలతో పోలిస్తే ఇవి 7శాతం ఎక్కువ. ఇందులో ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్లు 1శాతం పెరిగి 18,51,249 నుంచి 18,70,991కి చేరుకున్నాయి. ద్విచక్ర వాహనాల విక్రయాలు 9శాతం పెరిగి 85,66,531కి చేరాయి. వాణిజ్య వాహనాల రిజిస్ట్రేషన్లు 4,80,488 నుంచి 4,77,381కి స్వల్ప క్షీణతను నమోదు చేశాయి.
ఒక రకంగా చూస్తే దేశంలో పండుగల సీజన్ మొదలైంది. ఇది మాత్రమే కాదు. కంపెనీల నుండి కొత్త లాంచ్‌లు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే Tata Curvv.ev, Citroen Basalt, Mahindra Thar Roxx ప్రవేశించాయి. పండుగల సీజన్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ఈ కంపెనీలు రక్షాబంధన్‌కు ముందు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాయి. దసరా-దీపావళి సమయంలో అమ్మకాలపై డీలర్లతో పాటు కంపెనీలు కూడా ఆశావహంగా ఉన్నాయి. ప్రస్తుతం వ్యవసాయ పరిస్థితులు బాగున్నందున, గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పెరుగుతుందని భావిస్తున్నారు.