Nirmala Sitharaman: ఆ బాకాయిల విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ సీరియస్.. ఏమన్నారంటే?

2014-2023 మధ్య కాలంలో బ్యాంకులు రూ.10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుమారు 1,105 బ్యాంకు మోసాల కేసులను దర్యాప్తు చేసింది.

Written By: Neelambaram, Updated On : June 1, 2024 1:15 pm

Nirmala Sitharaman

Follow us on

Nirmala Sitharaman: బడా ఎగవేతదారుల నుంచి మొండిబకాయిలను వసూలు చేయడంలో ఎలాంటి ఉదాసీనత ప్రదర్శించబోమని, యూపీఏ హయాంలో మొండిబకాయిలు, స్వార్థ ప్రయోజనాలు, అవినీతి, దుర్వినియోగాలకు నిలయంగా ఉన్న బ్యాంకులు గతేడాది రికార్డు స్థాయిలో రూ.3 లక్షల కోట్లకు పైగా లాభాలను ఆర్జించాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.

2014-2023 మధ్య కాలంలో బ్యాంకులు రూ.10 లక్షల కోట్లకు పైగా మొండిబకాయిలను రికవరీ చేశాయని ఫైనాన్స్ మినిస్టర్ తెలిపారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుమారు 1,105 బ్యాంకు మోసాల కేసులను దర్యాప్తు చేసింది. దీని ఫలితంగా రూ. 64,920 కోట్ల మేర ఆదాయాన్ని జప్తు చేసిందని, 2023, డిసెంబర్ నాటికి రూ.15,183 కోట్ల ఆస్తులను పీఎస్బీలకు అప్పగించినట్లు తెలిపారు.

ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ ‘మా బ్యాంకింగ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు, స్థిరీకరించడానికి మేము నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూనే ఉంటాం, 2047 నాటికి వికసిత్ భారత్ కు భారతదేశం వృద్ధి మార్గానికి బ్యాంకులు మద్దతిచ్చేలా చూస్తాం’ అని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో వివరించారు.

అంత్యోదయ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం ‘బ్యాంకులలో ఖాతా లేని వారికి తీయించిందని, వివిధ పథకాలకు సంబంధించి నగదును నేరుగా బ్యాంకుల ఖాతాలోకి వెళ్తుందని ఆమె చెప్పారు. ఆర్థిక సమ్మిళితాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పేదలకు సాధికారత కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నాము’ అన్నారు. కొన్ని వారాలుగా సోషల్ మీడియా పోస్టుల్లో దివాలా చట్టం, ఆర్థిక నిర్వహణతో విఫలం అంటూ అనేక అంశాలు షేర్ అవుతున్నాయని వాటిపై ఆర్థిక మంత్రి దృష్టి సారించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్ రంగంలోకి తెచ్చిన ‘సముద్ర మంథన్’ సానుకూల ఫలితాలను ఇచ్చిందని, సంక్షోభ సమయంలో ఆశించిన సవాళ్లను ఎదుర్కొందని ఆమె తన తాజా పోస్ట్ లో వివరించారు. 2014లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్పీఏల సమస్యలను గుర్తించి పరిష్కరించడం, ప్రభుత్వ రంగ బ్యాంకులకు రీక్యాపిటలైజేషన్ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. బ్యాంకులను ‘ఎన్పీఏల పీడకలల’ నుంచి ‘జన్ కల్యాణ్ స్తంభాలు’గా మార్చాం. ‘ట్విన్ బ్యాలెన్స్ షీట్ ప్రాబ్లమ్’ నుంచి ‘ట్విన్ బ్యాలెన్స్ షీట్ అడ్వాంటేజ్’ వచ్చిందని ఆమె పోస్ట్ లో పేర్కొన్నారు.

జీరో బ్యాలెన్స్ ఖాతాలను వసూలు చేయడం, సరైన శ్రద్ధ లేకుండా రుణాలను ఆమోదించడం సహా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంకులకు ఆర్బిఐ జరిమానాలు విధించింది.